విశాఖలో లీకైన స్టైరిన్ రసాయనం కారణంగా దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని దిల్లీ ఎయిమ్స్ తెలిపింది. ఇదే సమయంలో ఈ స్టైరిన్ రసాయనం పూర్తిస్థాయిలో ప్రాణాంతకం కూడా కాదని పేర్కొంది. దీనికి సంబంధించి పెద్దగా చికిత్సా పద్ధతులు గానీ ప్రత్యేకమైన ఔషధాలు కూడా లేవన్న ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా.. వారికి కేవలం వైద్యపరమైన మద్దతు సరిపోతుందని వివరించారు.
ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది నయమై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. భోపాల్ తరహాలో దీర్ఘకాలిక సమస్యలేవీ ఎదురుకావని.. ఈ రసాయనం ఎక్కువ సమయం గాలిలో ఉండబోదని చెప్పారు. శరీరం నుంచి త్వరగానే బయటకు పోతుందని తెలిపారు. గ్యాస్ లీకైన ప్రాంతానికి సమీపంలో ఉన్న వారికి మాత్రం అధిక స్థాయిలో ఇబ్బందులు ఉంటాయని.. ఇంటింటి సర్వే ద్వారా వారిని గుర్తించి చికిత్స అందించాల్సి ఉంటుందని అన్నారు.
కోమాకు వెళ్లే ప్రమాదం
గాలి లేదా నోటి ద్వారా శరీరంలోకి స్టైరిన్ వెళ్తే కళ్ల సమస్యలు, చర్మసంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయని గులేరియా వివరించారు. ఈ రసాయనం కేంద్రనాడీవ్యవస్థపై దాడిచేసి వికారం, వాంతులు తలనొప్పి కళ్లు తిరిగి పడిపోవడం, నిలబడలేకపోవడం వంటివి కలుగుతాయని.. అధికమోతాదులో శరీరంలోకి వెళ్లిన వారు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. బాధితులను వెంటనే ఆ ప్రాంతం నుంచి తరలించి.. వాళ్ల కళ్లను నీళ్లతో శుభ్రం చేయాలన్నారు. శరీరంపై ఉన్న రసాయన ఆనవాళ్లను తుడిచేయాలని సూచించారు.
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని.. వారి మెదడు, ఊపిరితిత్తులపై ఈ గ్యాస్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని గులేరియా తెలిపారు. వీరిలో కొందరికి వెంటీలేటర్‌పై కూడా చికిత్స అందించాల్సి ఉంటుందని చెప్పారు. కొందరికి ప్రాణవాయువు కూడా అందించాల్సి ఉంటుందన్నారు.