దేశంలోని పలు రాష్ట్రాల్లో దండెత్తిన ఎడారి మిడతల వల్ల రబీ పంటకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరక్టర్ జనరల్ త్రిలోచన్ మోహపాత్రా స్పష్టం చేశారు. 40 నుంచి 42వేల హెక్టార్ల భూమిపై ఈ కీటకాలు దాడి చేశాయని తెలిపారు. అయితే... గోధుమ, పప్పు ధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర రబీ పంటలపై మిడతలు ప్రభావం చూపలేదని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటను కాపాడుకునే విధంగా వర్షాకాలం కన్నా ముందే కీటకాలను పూర్తిగా నివారించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం చేశారు మోహపాత్ర.
"జూన్-జులైలో మిడతల సంతానోత్పత్తి మరింత పెరుగుతుంది. అందువల్ల వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ కీటకాల వ్యాప్తిని అడ్డుకోవాలి. ఒకవేళ మిడతలను కట్టడి చేయలేకపోతే.. ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడుతుంది."
-త్రిలోచన్ మోహపాత్రా, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంచాలకులు
రసాయన ఎరువులతో ఈ కీటకాలను అంతమొందిస్తున్నట్లు మోహపాత్ర వెల్లడించారు. ప్రత్యేకమైన యంత్రాలతో రసాయనాలను పిచికారి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 700 ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
ఆహారం లేక వేరే చోటకు
కీటకాలు.. మొదట రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకే పరిమితమైనప్పటికీ.. తగినంత ఆహారం లభించకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని మిడత హెచ్చరిక సంస్థ(ఎల్‌డబ్ల్యూఓ) అధికారులు పేర్కొన్నారు. భారీగా వీస్తున్న గాలులను ఉపయోగించుకొని వేరే చోటకు పయనమవుతున్నాయని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొన్ని ప్రాంతాల్లో మిడతలను చాలా వరకు నియంత్రించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోకి మిడతలు భారీ ఎత్తున వెళ్లకుండా.. రాజస్థాన్‌లోనే ఈ మిడతలను నివారించడంపై ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపారు. మిడతల వ్యాప్తిని పాకిస్థాన్ నివారించి ఉంటే భారత్‌కు ఈ ముప్పు ఏర్పడి ఉండేది కాదని పేర్కొన్నారు.
"పాకిస్థాన్ నుంచి నిరంతరం మిడతలు దాడి చేస్తున్నాయి. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు, చాలా ఏళ్లుగా ఎదుర్కొంటూనే ఉన్నాం. అయితే 26ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో ప్రభావం కనిపిస్తోంది. అయినప్పటికీ సమన్వయంతో చర్యలు చేపట్టి వీటి వ్యాప్తిని అరికడుతున్నాం."
-ఎల్‌డబ్ల్యూఓ సీనియర్ అధికారి
రాజస్థాన్‌లో మిడతలు రోజుకు 100కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇదివరకు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించేవని, ఆ సమయంలో వాటిని నివారించడం తేలికగా ఉండేదని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో ఈ పురుగుల కారణంగా దెబ్బ తిన్న పంటలకు గాను ఆర్థిక సాయంగా రూ.68.65 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
మలాథియోన్
మిడతలను అరికట్టేందుకు రాజస్థాన్ ప్రభుత్వం "మలాథియోన్" అనే రసాయన పురుగుల మందును వినియోగిస్తోందని ఎల్‌డబ్ల్యూఓ ఫీల్డ్ అధికారులు తెలిపారు. విషపూరితమైన రసాయనం కావడం వల్ల రైతులు సొంతంగా వీటిని పిచికారి చేయలేరని పేర్కొన్నారు. గుజరాత్లో మిడతల వ్యాప్తి ఉన్నప్పటికీ.. భారీ సమూహాలుగా వ్యాపించడం లేదని తెలిపారు.
రాష్ట్రాలు అప్రమత్తం
పంటలను ధ్వంసం చేస్తోన్న మిడతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం డ్రోన్‌తో పోరాటాన్ని ప్రారంభించగా.. యూపీ ప్రభుత్వం ఝాన్సీ జిల్లాలో అగ్నిమాపక శకటాల ద్వారా పురుగుమందుల పిచికారీ చేపట్టింది. మహారాష్ట్రలోని నాగపూర్, వార్దా జిల్లాల్లో నారింజ, కూరగాయల పంటలపై మిడతలు దండెత్తినట్లు అధికారులు తెలిపారు. అయితే చాలా వరకు పంటల కోత పూర్తి కావడం వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నాగ్‌పుర్, వార్దా ప్రాంతాల్లో మిడతల కదలికలపై నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. పంట పొలాల్లో ఈ కీటకాలు వ్యాపించకుండా జాగ్రత్తలు చేపడుతున్నట్లు తెలిపారు.
మరోవైపు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి పురుగుల మందు పిచికారికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: భారత్‌తో వివాదంపై చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు