దేశంలో ఒక పక్క కరోనా విజృంభిస్తుంటే... ఉత్తరాది రాష్ట్రాలను కరోనాతో పాటు, మిడతల దండు కూడా భయాందోళనలకు గురి చేస్తోంది. నెలన్నర నుంచి రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు మిడతల సమస్యను ఎదుర్కొంటున్నాయి.
"గత నెలన్నర రోజులుగా వీటి దాడి కొనసాగుతోంది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్, జైసల్మేర్, బాడ్మేడ్, గంగానగర్ జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. ఇవన్నీ పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకోవడం వల్ల సులభంగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. వివిధ ఆపరేషన్లు నిర్వహించిన చాలా మిడతల్ని నియంత్రించాం. కానీ, సమస్య ఏంటంటే... ఇప్పటికే వచ్చిన మిడతల్ని హతమార్చగా, ఇప్పుడు కొత్త దండు వస్తోంది. వాటిని మట్టుబెట్టేందుకు అవసరమైతే నావికాదళ హెలికాప్టర్లను కూడా వినియోగించమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది."
-బీఆర్ ఖద్వా, రాజస్థాన్ వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్
పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇవి గుడ్లు పెట్టి రావడం వల్ల కొత్త మిడతలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు ఖద్వా.
మరికొద్ది రోజుల్లో రాజస్థాన్‌లో వర్షాకాలం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ దండు పని పట్టాలని అధికారులు భావిస్తున్నారు. బాడ్మేడ్, జసల్మేర్, బికనేర్, జోధ్‌పుర్‌లో డ్రోన్‌ల సాయంతో రసాయనాలను పిచికారీ చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. మిడతల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఏరియల్ స్ప్రే చేసేందుకు ప్రొటోటైప్ వాహనాలను సిద్ధం చేసింది. అజ్మేర్, బికనేర్‌లో వీటిని ప్రయోగాత్మకంగా వినియోగించారు. పూర్తిస్థాయిలో వాడటానికి అనుమతులు రావాల్సి ఉంది.
ఇదీ చూడండి: మైనర్‌కు 66 ఏళ్ల బాషా ప్రేమలేఖ- చివరకు...