భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టేందుకు 21 రోజుల లాక్డౌన్ ఉపయోగపడే అవకాశాలున్నాయంటున్నారు పరిశోధకులు. లాక్డౌన్ 20 రోజులకు చేరే సరికి.. కేసుల నమోదులో 83 శాతం తగ్గే సూచనలున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని శివ్‌నాడార్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు. దేశంలో లాక్డౌన్ లేనట్లయితే ఏప్రిల్ 13 నాటికి 30,790 వైరస్ కేసులు, 619 మరణాలు నమోదయ్యే అవకాశాలుండగా.. లాక్డౌన్ వల్ల ఆ సంఖ్య 3,500 కేసులు, 105 మరణాలుగానే ఉంటుందని తాజా పరిశోధనలో పేర్కొన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, కళ్లు, ముక్కును తాకకుండా ఉండటం, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలతో కూడా కరోనా కేసుల సంఖ్యను తగ్గించొచ్చని స్పష్టం చేశారు.
" దేశంలో ఒకవేళ లాక్డౌన్ విధించకుంటే.. రాబోయే 10 రోజుల్లో 5వేలు, 20 రోజుల్లో 30,790 కరోనా కేసులు నమోదయ్యేవని మా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. 40వ రోజుకు కేసుల సంఖ్య 2,70,360కి చేరేది. మరణాలు 5,407గా నమోదయ్యేవి."
- నాగ సురేష్ వీరపు, అసిస్టెంట్ ప్రొఫెసర్, శివ్‌నాడార్ విశ్వవిద్యాలయం
R0 ఆధారంగా..
పునరుత్పత్తి నిష్పత్తి(R0) సూచీ, జన సమూహాల నిషేధం, వైరస్ లక్షణాలున్న వారిని 14 రోజుల క్వారంటైన్‌కు తరలింపు, ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోం, సూపర్ స్ప్రెడింగ్ నియమం వంటి వాటి ఆధారంగా ఈ గణాంకాలు లెక్కగట్టారు. లాక్డౌన్ 20 రోజులకు చేరే సరికి దేశంలో R0 సూచీ 2.2గా, సూపర్ స్ప్రెడింగ్ 20/80గా ఉంటుందని వెల్లడించారు.
సాధారణంగా వైరస్ సోకిన ఒక వ్యక్తి ద్వారా ఎంతమందికి వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపే ఓ ప్రామాణిక సూచీయే పునరుత్పత్తి నిష్పత్తి(R0). ఉదాహరణకు R0 సూచీ 1.3-2 వరకు ఉంటే.. వైరస్ సోకిన వ్యక్తి.. ఒకరి నుంచి ఇద్దరికి వ్యాప్తి చేయగలడని అర్థం. అలాగే సూపర్ స్ప్రెడింగ్ 20/80 రూల్ అంటే... నమోదైన మొత్తం కేసుల్లో 20 శాతం మంది 80 శాతం వైరస్ వ్యాప్తికి సహకరించారని అర్థం.
మార్చి 24న లాక్డౌన్
దేశంలో కరోనా కారణంగా ఇప్పటికే 1,965 కేసులు నమోదవగా, 50 మంది మహమ్మారికి బలయ్యారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 24 నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏప్రిల్ 14న ఈ లాక్డౌన్ ముగుస్తుంది.