అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లినపుడు సతీమణి(ప్రథమ మహిళ)ని వెంట తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇప్పుడు కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలనియాతో కలిసి భారత పర్యటనకు విచ్చేస్తున్నారు. దిల్లీలో ఆమె ఓ పాఠశాలను కూడా సందర్శించబోతున్నారు. ట్రంప్ కూతురు ఇవాంక, ఆమె భర్త జేర్డ్ కుష్నర్ కూడా మన దేశానికి వస్తున్నారు. గతంలో అధ్యక్షులతో కలిసి భారత పర్యటనకు విచ్చేసిన ప్రథమ మహిళలు ఎవరు? వారు ఇక్కడ ఏమేం చేశారు? అనేవి ఆసక్తికర విషయాలు.
జాక్వెలైన్ కెన్నడీ..1962
అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీ లేకుండానే ప్రథమ మహిళ జాక్వెలైన్ కెన్నడీ 1962లో భారత్‌ను సందర్శించారు. అమెరికా రాయబారి జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ ఆహ్వానం మేరకు ఆమె మనదేశానికి విచ్చేశారు. పలు దర్శనీయ స్థలాలకు వెళ్లారు. రాజస్థాన్‌లో ఒంటెపై సవారీ చేశారు. గంగా నదిలో పడవపై విహరించారు. ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో విందుకు హాజరయ్యారు. తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఎక్కువ రోజులు ఆమె భారత్‌లో ఉన్నారు.
ప్యాట్ నిక్సన్..1969
రిచర్డ్ నిక్సన్ తన సతీమణి ప్యాట్‌తో కలిసి 1969లో ఇండియాకు వచ్చారు. వీరు ఒక్కరోజు మాత్రమే మనదేశంలో ఉన్నారు. భారత్‌ను సందర్శించిన అమెరికా అధ్యక్షుల్లో వీరిదే అతి స్వల్ప వ్యవధి పర్యటన.
రోజలిన్ కార్టర్..1978
భర్త జిమ్మీ కార్టర్‌తో కలిసి 1978లో భారత్ సందర్శించిన రోజలిన్ ఇక్కడ రెండురోజులున్నారు. దక్షిణ దిల్లీకి సమీపంలోని ఛుమా ఖేరాగావ్‌ను ఇద్దరూ కలిసి సందర్శించారు. ఆ ఊరికి ఒక టీవీని బహూకరించారు. రోజలిన్ నుదుటిపై స్థానిక మహిళలు బొట్టు పెట్టారు. వీరిద్దరూ సందర్శించి వెళ్లిన తర్వాత ఆ ఊరి పేరును ‘కార్టర్‌పురి’గా మార్చారు. నేటికీ అదే పేరు కొనసాగుతోంది.
బార్బరా బుష్..1984
అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో 1984లో హెచ్.డబ్ల్యూ.బుష్ భారత్ సందర్శించినపుడు ఆయన సతీమణి బార్బరా బుష్ కూడా వెంట ఉన్నారు. ఇది సౌహార్ద పర్యటన. ఈ జంట తాజ్ మహల్‌ను సందర్శించింది. కొన్ని ఫొటోలు దిగింది. ఆ తర్వాత కొన్నేళ్లకు బుష్ అమెరికా అధ్యక్షుడయ్యారు.
హిల్లరీ క్లింటన్.. 1995, 1997
హిల్లరీ క్లింటన్ 1995లో భారత్‌లో మూడు రోజులు గడిపారు. ఈ పర్యటనలో భర్త, అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఆమెతో కలిసి రాలేదు. కూతురు చెల్సియాతో కలిసి హిల్లరీ తాజ్‌మహల్ సహా భారత్‌లోని అనేక దర్శనీయ స్థలాలకు వెళ్లారు. రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. 1997లో కోల్‌కతాలో మదర్‌థెరెసా అంత్యక్రియలకు కూడా హిల్లరీ ఒంటరిగా వచ్చారు.
లారా బుష్.. 2006
భర్త జార్జి డబ్ల్యూ.బుష్‌తో కలిసి 2006లో విచ్చేసిన ప్రథమ మహిళ లారాబుష్ భారత్‌లో దాదాపు 60 గంటల సేపు ఉన్నారు. దిల్లీలోని ఓ పాఠశాలను, జీవన్‌జ్యోతి దివ్యాంగుల హోంను, రాజ్‌ఘాట్‌ను, నోయిడాలోని ఫిల్మ్‌సిటీని సందర్శించారు. హైదరాబాద్‌కు విచ్చేసి దాదాపు మూడు గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మిషెల్ ఒబామా.. 2010, 2015
భర్త బరాక్ ఒబామాతో కలిసి 2010లో భారత్‌ను సందర్శించిన మిషెల్.. సాదాసీదా మహిళలాగా అందరితో కలిసిపోయి గడిపారు. ముంబయిలోని ఓ పాఠశాలలో పిల్లలతో కలిసి చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ముంబయి యూనివర్సిటీలో ఆమె ప్రసంగాన్ని వేనోళ్లా పొగిడారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ దంపతులు ఒబామా దంపతులకు ఆతిథ్యం ఇచ్చారు. 2015లో భర్తతో కలిసి మిషెల్ మరోమారు మనదేశానికి వచ్చారు. భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఒబామా దంపతులకు ప్రధాని నరేంద్రమోదీ సాదర స్వాగతం పలికారు.
ఇదీ చూడండి:ట్రంప్‌కు దిల్లీలో ప్రత్యేక విందు- మెనూ చాలా స్పెషల్