గుజరాత్లోని గిర్ అడవుల్లో నివసించే ఆసియా సింహాలు అంతకంతకూ వాటి సంతతిని పెంచుకుంటున్నాయి. ఒకానొక దశలో అంతరించే దశకు చేరుకున్న ఈ క్రూర మృగాలు.. గత ఐదేళ్ల కాలంలో 29 శాతం మేర పెరిగినట్లు తాజా సర్వేల్లో వెల్లడైంది.
వన్య ప్రాణులకు ఆవాసంగా మారిన గిర్ అడవుల్లోనే ఆసియా సింహాలు కూడా మనుగడ సాగిస్తుంటాయి. అయితే.. గుజరాత్ అటవీ శాఖ, జంతు ప్రేమికులు తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. ఐదేళ్ల కాలంలో ఆసియా సింహాల శాతం 28.87 శాతం మేర పెరగగా.. ఇప్పటివరకు ఇదే అత్యధికం. 2015 లో వీటి సంఖ్య 523 కాగా.. ప్రస్తుతం 674 కు పెరిగినట్లు తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఐదేళ్లకొకసారి..
సింహాల సంఖ్యను ప్రతి ఐదేళ్లకు ఒకసారి లెక్కిస్తూ ఉంటారు. గిర్ అడవుల్లో ఈ ఏడాది మేలో లెక్కింపు నిర్వహించాల్సి ఉండగా కరోనా వ్యాప్తి, లాక్డౌన్ల కారణంగా వీలుకాలేదు. అయితే ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో.. ఈ నెల 5, 6న సింహాల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు అటవీ శాఖ అధికారులు.
ఏయే సింహాలు ఎన్నంటే..
నిండు చంద్రుడి వెలుగులో పౌర్ణమి నాడు నిర్వహించే ఈ సర్వేను 'పూనమ్ అవ్‌లోకన్' అని పిలుస్తారు. సుమారు 1400 మంది అటవీ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సమాచారం, గుర్తింపు చిహ్నాలు, రేడియో కాలర్ సంఖ్యల ఆధారంగా.. ఆసియా సింహాలను లెక్కించారు. సర్వే అనంతరం.. వీటి మొత్తం 674 అని తేల్చారు అధికారులు.
సింహం రకాలు | సంఖ్య |
మగ సింహాలు | 161 |
ఆడ సింహాలు | 260 |
యుక్త వయస్సు సింహాలు | 116 |
కూన సింహాలు | 137 |
మొత్తం | 674 |
పెరిగిన విస్తరణ పరిధి..
2015లో జరిగిన లెక్కింపులో ఆసియా సింహల సంఖ్య.. 2010తో పోలిస్తే 27 శాతం మేర పెరిగింది. 2015లో ఆసియా సింహాలు 22,000 చదరపు కిలోమీటర్లు విస్తరించగా.. తాజా గణాంకాల్లో అది 30,000 చ.కి.మీ.లకు చేరినట్లు తేలింది.
గుజరాత్- గిర్ అడవుల్లో పెరిగిన ఆసియా సింహాల పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
'గిర్ అడవుల్లో నివసించే ఆసియా సింహాలు 29 శాతం మేర పెరగడం అభినందనీయం. భౌగోళికంగా వాటి పరిధి సుమారు ఇది 36 శాతం. ఈ ఘనత సాధించేందుకు కారకులైన వారందరికీ ఈ కీర్తి దక్కుతుంది.'
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చదవండి: ఆ అడవిలో పులి, చిరుతల మృతదేహాలు లభ్యం