ప్రకృతి వైపరీత్యాలు దేశంలోని పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అసోం, బిహార్, మేఘాలయ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కురిసిన పిడుగులు పలువురి మృతికి కారణమయ్యాయి.
పిడుగుల వల్ల 32 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఆదివారం వచ్చిన పిడుగుల ధాటికి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆధికారులను ఆదేశించారు.
ప్రాణాలు పోతూనే ఉన్నాయ్...
వరదల విలయంలో చిక్కుకున్న బిహార్, అసోం రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 166కు చేరుకుంది. అసోంలో 64, బిహార్‌లో 102 మంది మరణించారు. వరదలు తగ్గుముఖం పట్టినా...బిహార్‌లో 12 జిల్లాలు, అసోంలో 18 జిల్లాలు ఇంకా నీటమునిగే ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తంగా 1.11 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు.
సీతామర్హి, దర్బాంగా జిల్లాల్లోని పునరావాస కేంద్రాలను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సందర్శించి బాధితులను పరామర్శించారు.
అయ్యో! మూగజీవాలు...!
అసోంలోని కాజీరంగ నేషనల్ పార్క్‌లో మృతిచెందిన వన్యప్రాణుల సంఖ్య 141కు చేరింది. ఆహారం లేక జంతువులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
కేరళ అతలాకుతలం
భారీ వర్షాల ధాటికి వరదలు ఉప్పొంగి కేరళలో నలుగురు మరణించగా, ముగ్గురి ఆచూకీ గల్లంతైంది. వాతావరణ విభాగం నాలుగు జిల్లాల్లో జులై 23 వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ప్రస్తుతం వర్షాల తీవ్రత తగ్గినా... తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. చేపల వేటకు వెళ్లకూడదని మత్స్యకారులను హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించింది.
దిల్లీలో భారీ వర్షాలు
దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధానిలో సుమారు 106 మి.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి: WC19: 'పొరపాటు నాదే.. కానీ చింతించడం లేదు'