ఖాదీ వాచీలపై లోక్‌సభలో ఆసక్తికర చర్చ జరిగింది. స్పీకర్ ఓంబిర్లా, ఆయన సతీమణికి ప్రత్యేకంగా రూపొందించిన ఖాదీ చేతి గడియారాలను అందజేసినట్లు సభలో చెప్పారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. తమకెప్పుడు ఆ వాచీలను అందజేస్తారని డీఎంకే నేత టీఆర్ బాలు సహా విపక్ష సభ్యులు ఛలోక్తులు విసురుతూ గడ్కరీని ప్రశ్నించారు. వారికి అదే స్థాయిలో సమాధానమిచ్చి... సభలో నవ్వులు పూయించారు గడ్కరీ.
మొదలైందిలా..
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రగతిపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తున్నారు. అదే సమయంలో స్పీకర్ ఓం బిర్లా ఆయనకు చెయ్యి చూపుతూ సంజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ద్వారా తయారైన ఖాదీ వాచీలను స్పీకర్ ఓంబిర్లా, ఆయన సతీమణికి బహూకరించినట్లు చెప్పారు గడ్కరీ.
ఈ నేపథ్యంలో డీఎంకే నేత టీఆర్ బాలు సహా పలువురు సభ్యులు ఖాదీ వాచీలు తమకు ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. తమకు ఎప్పటికల్లా వాచీలు అందుతాయో తెలపాలని కోరారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి గడ్కరీ.
"మహిళలే ఖాదీ వాచీలను తయారు చేస్తున్నారు. ఒక్కో వాచీకి రూ. 5వేలు ఖర్చు అవుతోంది. ఖాదీ వాచీని సభ్యులకు తగ్గింపు ధరల్లో ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ప్రస్తుతం అవి మార్కెట్లో లేవు"
-నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి
ఖాదీ వాచీ ప్రత్యేకతలు
ఈ వాచీకి చర్ఖాను పోలిన వెండి డయల్‌ను ఏర్పాటుచేశారు. ఖాదీతో తయారుచేసిన బెల్ట్‌ను రూపొందించారు. ఈ వాచీలను ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్-టైటాన్ సంస్థ సంయుక్తంగా తయారుచేశాయి.
- ఇదీ చదవండి: కమల్‌నాథ్ సర్కార్ భవితవ్యం తేలేది ఆరోజే...