ప్లాస్టిక్ మహమ్మారిని పారదోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. అయితే ఐకమత్యంతో ఆ లక్ష్యాన్ని అలవోకగా సాధించొచ్చని నిరూపిస్తోంది మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామం.
ఇండోర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని 'సిలోదా'ను 'నీలి గ్రామం'గా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇళ్లు, గోడలన్నీ నీలిరంగులోనే ఉంటాయి. సిలోదా ప్రాస్టిక్ రహిత గ్రామమని చెప్పేందుకు ఈ రంగును ఎంచుకున్నారు గ్రామస్థులు.
గ్రామస్థుల సమైక్యకృషితో 80 రోజుల్లోనే ప్లాస్టిక్ నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేశారు. ఇతర గ్రామస్థుల్లోనూ స్ఫూర్తిని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే గ్రామంలోని గోడలపై ప్లాస్టిక్ వ్యతిరేక నినాదాలు, శుభ్రతకు సంబంధించిన సూక్తులు దర్శనమిస్తాయి.
"ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా అనేక వ్యాధులు ప్రబలుతాయి. ఈ కాలంలో చాలా వ్యాధులు వస్తున్నాయి. అందుకే ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించాం."
- గ్రామస్థురాలు
గతేడాది అక్టోబర్ 2న గాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు గ్రామస్థులు. ప్రారంభంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సంచుల వాడకం క్రమంగా పెరిగాక ఆ కష్టాలు తీరాయని చెబుతున్నారు.
"అక్టోబర్ 2న మా గ్రామానికి కలెక్టర్ వచ్చారు. ఆయన సమక్షంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని మేమంతా శపథం చేశాం. 80 రోజుల్లో దీన్ని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రతిరోజు కృషి చేశాం. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించాం. ప్లాస్టిక్ వల్ల వచ్చే సమస్యలను ప్రజలకు వివరించాం. ఈ క్రమంలో ప్లాస్టిక్ కవర్లకు బదులుగా వస్త్రాలతో చేసిన సంచులను దుకాణాలకు అందించాం. రూ.5 ఇస్తే సంచులు ఇస్తారు. మళ్లీ ఆ సంచిని తిరిగి తీసుకొస్తే 5 రూపాయలు ఇస్తారు. ఇలా అందరం కలిసి 80 రోజుల్లో ప్లాస్టిక్‌ను తరిమికొట్టాం. "
- సందీప్ మిశ్రా, గ్రామ కార్యదర్శి
ప్రజలను ప్రోత్సహించేందుకు గ్రామ పరిసరాల్లోని ఓ చెట్టును బట్ట సంచులతో అలంకరించారు. అంతేకాదు.. గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం అమలును పర్యవేక్షించేందుకు 10 బృందాలను నియమించారు.