దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. మహానగరాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు... అన్నీ ఈ మహమ్మారి ధాటికి వణికిపోతున్నాయి. ఈ తరుణంలో దేశంలో ఇంతవరకు కరోనా సోకని ప్రాంతం ఉందంటే నమ్మగలరా? అవునండి నిజమే. అదే... ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని మనా అనే గ్రామం. భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ చిట్టచివరి గ్రామంలో ఇంత వరకు ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీనికి ఆ ప్రాంత అధికారులు, గ్రామస్థులు తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలే కారణం.
దేశవ్యాప్తంగా అన్లాక్-4 నడుస్తోంది. దాదాపు వాణిజ్య కార్యకలపాలన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటికీ మనా గ్రామంలో కట్టుదిట్టంగా లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది.
బద్రీనాథ్ ధామ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మనా గ్రామం. భోత్యా తెగకు చెందిన వారు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. శీతాకాలంలో వీరంతా గోపేశ్వర్ పట్టణానికి సమీపంలో ఉన్న ఘింగరన్ అనే ప్రాంతానికి వలస వెళ్తారు. తిరిగి వేసవికాలం వచ్చిన తర్వాత ఎవరింటికి వారు తిరిగి వస్తారు. మనా గ్రామంలో మొత్తం 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. గ్రామస్థులందరూ కలిసికట్టుగా తమ గ్రామంలోకి ఎవరు ప్రవేశించకుండా లాక్డౌన్ను విధించుకున్నారు.
"మా గ్రామస్థుల్లో ఎవరూ కరోనా బారిన పడలేదని చెప్పటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మా గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వాస్తవానికి మా గ్రామస్థులే పూర్తి లాక్డౌన్ను విధించారు. ఏ ఒక్కరిని కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లటానికి గానీ, లోపలికి రావటానికి గానీ అనుమతించటం లేదు. ఇందుకు అనుగుణంగా మాకు కావాల్సిన కూరగాయలను మేమే పండించుకుంటున్నాం."
-పితాంబర్ మోల్ఫా, గ్రామ పెద్ద.
సాధారణ రోజుల్లో బద్రీనాథ్ వెళ్లే యాత్రికులు, పర్యటకులు వివిధ రకాల వస్తువులను ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. అదే ఈ ప్రాంత ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు. గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మనాను పర్యటక గ్రామంగానూ ప్రకటించింది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి కారణంగా భక్తులను బద్రీనాథ్ తీర్థయాత్రకు అనుమతించకపోవటం వల్ల ఈ గ్రామ ప్రజలు ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్నారని పితాంబర్ తెలిపారు.