బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడం వల్ల రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు వెళ్లారు. ఆయన కుమార్తె మీసా భారతి శుక్రవారం ఆసుపత్రికి చేరుకున్నారు.
చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్, లాలూ భార్య రబ్రీ దేవి పట్నా నుంచి ఛార్టెడ్ విమానంలో బయలుదేరి ఆసుపత్రిలో లాలూను కలిశారు. చాలాకాలంగా పలురకాల వ్యాధులతో లాలూ బాధపడుతున్నారు.
"మా తండ్రికి మంచి చికిత్స అందించాలని మేము కోరుతున్నాం. అయితే పరీక్షల నివేదికలు వచ్చాక ఇక్కడ ఎలాంటి చికిత్స అందించగలరో వైద్యులే తెలియజేయాలి. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నేను ముఖ్యమంత్రిని కలుస్తాను."
- తేజస్వీ యాదవ్, లాలూ కుమారుడు
గురువారం లాలూ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడం వల్ల ఆయన్ను వెంటనే రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
"ప్రస్తుతం లాలూ ప్రసాద్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది. ఇది ఓ రకమైన నిమోనియా. చికిత్స కొనసాగిస్తున్నాం. ఎయిమ్స్ ఆసుపత్రి ఊపిరితిత్తుల విభాగం అధిపతితో సంప్రదింపులు జరుపుతున్నాం."
- డా. కామేశ్వర్ ప్రసాద్, రిమ్స్ సంచాలకుడు