రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నవంబర్ 9న బెయిల్‌పై విడుదలవుతున్నారని తెలిపారు ఆయన కుమారుడు, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్. ఆ మరుసటి రోజునే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వీడ్కోలు అందుకుంటారని పేర్కొన్నారు. నవంబర్ 10న బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు తేజస్వీ. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
" లాలూ జీ నవంబర్ 9న విడుదల అవుతున్నారు. ఇప్పటికే ఓ కేసులో బెయిల్ వచ్చింది. మరో కేసులో నవంబర్ 9న బెయిల్ వస్తుంది. అదే రోజు నా పుట్టిన రోజు కూడా. ఆ మరుసటి రోజు నితీశ్ కుమార్‌కు వీడ్కోలు.
నితీశ్ జీ.. మీరు అలసిపోయారు. బిహార్ యోగక్షేమాలు చూసే స్థితిలో లేరు. 15 ఏళ్లలో ఉద్యోగాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించలేని వారు వచ్చే ఐదేళ్లలోనూ ఆ పని చేయలేరు. ప్రధాని బిహార్‌కు వచ్చిన క్రమంలో.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రాకేజీ ఎప్పుడు ఇస్తారో చెబుతారని ఊహించా. కానీ, అలా జరగలేదు. "
- తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి
కరోనా వైరస్ భయంతో 144 రోజుల పాటు సీఎం కార్యాలయం నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని ఆరోపించారు తేజస్వీ. మహాకూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి.. నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ఎన్డీఏ ప్రశ్నకు సమధానమిచ్చారు ఆర్జేడీ నేత. బిహార్ బడ్జెట్ రూ.2.13 లక్షల కోట్లు అయితే.. నితీశ్ ప్రభుత్వం కేవలం 60 శాతం ఖర్చు చేసిందని.. ఇంకా రూ.80,000 కోట్లు మిగిలి ఉంటాయన్నారు.
ప్రస్తుతం నడుస్తోన్న పోటీ నితీశ్, తేజస్వీ మధ్య కాదని.. రాహుల్ గాంధీ, మోదీ మధ్య సమరంగా పేర్కొన్నారు యాదవ్. నియంతృత్వ ప్రభుత్వం, ప్రజల మధ్య పోటీగా అభివర్ణించారు.
ఇదీ చూడండి: 'ఆ వ్యాఖ్యలతో జవాన్లను అవమానించిన మోదీ'