మండ్య లోక్‌సభ ఎన్నికల్లో మీడియా కవరేజీ విషయంపై నిరాశతో ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఆదివారం ఒక్కసారిగా మీడియాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మండ్యలో ఆయన కుమారుడు నిఖిల్ గౌడ... స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలత అంబరీశ్‌పై పోటీ చేశారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్‌ను... కుమారస్వామి ఆదివారం కలిసిన అనంతరం మీడియా ఎదురుపడింది. భేటీపై ప్రశ్నిస్తుండగా సీఎం ఒక్కసారిగా 'నేను మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను' అని వ్యాఖ్యలు చేశారు.
'మీరు ఒక వార్త కోసం.. ఎంతవరకైనా వెళ్తారు కదా.. వెళ్లండి.. ఎంజాయ్ చేయండి' అని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అసలు కారణం ఏమిటో తెలియదు కానీ.. మండ్య ఎన్నికల్లో మీడియా కవరేజీపైనే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కర్ణాటక సీఎం ఇలా చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతేడాది నవంబర్లోనూ 'ఏ విషయంపైనైనా విలేకరుల సమావేశం నిర్వహించబోనని' మీడియాను బహిష్కరించి వార్తల్లో నిలిచారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విషయంలో మీడియాపై ఇటీవల విమర్శలు గుప్పించారు కన్నడ ముఖ్యమంత్రి. మోదీ అందంగా మేకప్ చేసుకుంటారు కనుకే... మీడియా కేవలం ఆయననే చూపిస్తుంది అని ఆరోపించారు.