లాక్డౌన్ తెచ్చిన తిప్పలు అన్నీఇన్నీ కావు. అందరిదీ ఓ బాధ అయితే మందుబాబులది మరో బాధ. చుక్క మందు లేక అల్లాడిపోతున్నారు. మందు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఎంతటి దూరమైనా ప్రయాణించేందుకు వెనుకాడటం లేదు. కేరళకు చెందిన కొంతమంది మద్యం కోసం నదిని దాటుకొని కర్ణాటక వెళ్తున్నారు.
మైసూర్ హెచ్కోట్ తాలూకాలోని కేరళ- కర్ణాటక సరిహద్దు వద్ద మద్యం కొనేందుకు.. కేరళ వాసులు బౌలి ప్రాంతంలోని కబిని నదిలో ఈతకొట్టుకుంటూ వస్తున్నారు. లాక్డౌన్ కారణంగా అంతర్రాష్ట్ర సరిహద్దు మూసేయడం వల్ల వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది చూసిన స్థానికులు తమ మొబైల్లో చిత్రీకరించారు.
గ్రామంలోకి కేరళవాసులు అక్రమంగా ప్రవేశించడాన్ని అడ్డుకోవాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెరుచుకున్న మద్యం దుకాణాలు
మరోవైపు దాదాపు రెండు నెలల తర్వాత కేరళలో మద్యం విక్రయాలు ప్రారంభించింది ప్రభుత్వం. మద్యం షాపుల ముందు జనం గుమిగూడకుండా ఆన్లైన్ ద్వారా సేవలందించేందుకు సరికొత్త యాప్ను ప్రవేశపెట్టింది.