మద్యం సేవించి వాహనాలు నడిపేవారిలో చైతన్యం తెచ్చి, ప్రమాదాలను నివారించాల్సిన ఐఏఎస్ అధికారే కట్టు తప్పిన ఘటన కేరళలో జరిగింది. మద్యం సేవించి అతివేగంతో బాధ్యతారాహిత్యంగా అధికారి వాహనాన్ని నడపడం... ఓ విలేకరి నిండు ప్రాణాలు బలి తీసుకుంది.
కేరళలోని తిరువనంతపురంలో శనివారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు, ముందు ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వార్తా సంస్థకు చెందిన జర్నలిస్టు కేఎం బషీర్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన ఐఏఎస్ అధికారి శ్రీరామ్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భిన్న వాదనలు...
ప్రమాద సమయంలో కారులో ఉన్న తన స్నేహితురాలు వాహనాన్ని నడుపుతోందన్నారు శ్రీరామ్. ప్రత్యక్ష సాక్షులు మాత్రం కారులో ఉన్న పురుషుడే డ్రైవ్ చేస్తున్నారని వెల్లడించారు. చోదకుడు మద్యం తాగినట్లు అనిపించిందని, వేగంగా కారు నడిపించారని తెలిపారు.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వాస్తవాలు తేల్చుతామని చెప్పారు పోలీసులు.
వైద్య పరీక్షల ఆధారంగా నిర్ధరణ
ఐఏఎస్ అధికారి శ్రీరామ్ రక్తనమూనాలను పరీక్షించిన వైద్యులు మద్యం సేవించినట్లుగా నిర్ధరించారు.
ఇదీ చూడండి: అజెండా బంగాల్... భాజపా ఎంపీలకు 'క్లాస్'