అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటించింది కేరళ ప్రభుత్వం. నిర్వహణ బాధ్యతను ట్రావెన్కోర్ వంశస్థులకు అప్పగిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన దేశాలను అమలు చేస్తామని తెలిపారు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్.
" సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తోంది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను విశ్లేషించాల్సి ఉంది. పూర్తిస్థాయి ఆదేశాలు ఇంకా అందలేదు. సుప్రీం తీర్పును మేము అమలు చేస్తాం. తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుంది. "
- కడకంపల్లి సురేంద్రన్, కేరళ దేవాదాయ శాఖ మంత్రి.
స్వాగతించిన రాజవంశస్థులు
పద్మనాభుడి ఆలయ నిర్వహణను అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు ట్రావెన్కోర్ రాజవంశస్థులు. తీర్పుతో చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.
" ఈ తీర్పు పద్మనాభుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాం. స్వామివారు కేవలం ఓ కుటుంబం కాదు.. భక్తులందరికీ చెందినవారు. అందరూ సురక్షితంగా, ఆయురారోగ్యాలతో ఉండేందుకు స్వామివారి నిరంతర కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాం. మాకు మద్దతు పలికిన వారందరికీ కృతజ్ఞతలు."
- పూయమ్ తిరునల్ గౌరీ పార్వతి బాయి, రాజవంశస్థురాలు.
అనంత పద్మనాభ స్వామి ఆలయం నిర్వహణ, ఆస్తుల బాధ్యతను రాజవంశస్థులను నుంచి కేరళ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2011లో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టి వేసింది. రాజవంశస్థుల హక్కులను సమర్థిస్తూ.. వారికే అప్పగించాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: అనంత పద్మనాభుడి ఆలయ నిర్వహణ ట్రావెన్కోర్కే