కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం.శివశంకర్‌ను అదుపులోకి తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). ముందస్తు బెయిల్‌కు కేరళ హైకోర్టు బుధవారం నిరాకరించిన నేపథ్యంలో.. ఓ ప్రైవేటు ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకుంది.
బంగారం స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ విభాగం, ఈడీ నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఎం.శివశంకర్. బుధవారం విచారణ సందర్భంగా.. ఈడీ బలంగా వాదనలు వినిపించింది. విచారణకు సహకరించకపోవటం వల్ల కస్టడిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ కేసులో కీలకంగా ఉన్న శివశంకర్‌కు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించింది. ఈడీ వాదనలను ఏకీభవించిన న్యాయస్థానం.. బెయిల్‌కు నిరాకరించింది.
30 కిలోల బంగారం..
యూఏఈ నుంచి వచ్చిన సరకు రవాణాలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సరిత్‌ను జులై 5న అరెస్ట్ చేశారు. కాన్సులేట్ మాజీ ఉద్యోగిని స్వప్నా సురేశ్, అతని సన్నిహితుడు సందీప్ నాయర్‌ను కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. శివశంకర్ బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అక్టోబర్ 22న హైకోర్టుకు తెలిపింది ఎన్ఐఏ.
ఇదీ చూడండి: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు దావుద్‌తో లింకేంటి?