హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి కేరళలో తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి ఆహ్వానాన్ని అందుకుంది. బాలిక పాటను మెచ్చుకున్న సీఎం జైరాం ఠాకూర్.. ఆమెను తమ రాష్ట్రానికి స్వాగతించారు.
'ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్'లో భాగంగా..
కేరళలోని కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదివే అమ్మాయి దేవిక.. 'చంబా కిత్ని దూర్' అనే ప్రముఖ హిమాచల్ గీతాన్ని ఆలపించింది. 'ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్' కార్యక్రమంలో ఆమె ఈ పాటను పాడింది. వివిద ప్రాంతాల సంస్కృతి, భాషలపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దేవిక పాడిన పాటను తన ఫేస్బుక్ ఖాతాలో ప్రశంసించారు ఆ రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్.
"కేరళ అమ్మాయి దేవిక తన మధురమైన స్వరంతో.. ఈ పాట పాడి హిమాచల్ ప్రదేశ్ కీర్తిని రెట్టింపు చేసింది. తన పాటతో హిమాచల్ వాసుల హృదయాలను గెలుచుకుంది. ఆమె కావాలనుకుంటే మా రాష్ట్రాన్ని సందర్శించొచ్చు. రాష్ట్ర అతిథి హోదా అందించి గౌరవిస్తాం. "
--- జైరాం ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి.
దేవికకు మంచి భవిష్యత్తు దక్కాలని జైరాం ఠాకూర్ ఈ సందర్భంగా అభినందించారు.
ఇదీ చూడండి:ఏకధాటిగా తబలా వాయించి గిన్నిస్ రికార్డు