రైతులకు మద్దతుగా నిలిచేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో పండించే పంటలకు కనీస ధర నిర్ణయించింది. మొదటి దశలో 16 రకాల కూరగాయలకు ధరలను ఖరారు చేసింది. నవంబరు 1నుంచి ఇవి అమల్లోకి వస్తాయని సీఎం పినరయి విజయన్ తెలిపారు. మార్కెట్లో అస్థిరత నెలకొన్న సమయంలో రైతులకు అండగా నిలబడేలా ఈ తరహా నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రం కేరళ అని ఆయన వెల్లడించారు.
మొదటి దశలో భాగంగా అరటి, బంగాళదుంప, క్యారట్, చిలకడదుంప, బెండకాయ, బూడిద గుమ్మడి, కాకరకాయ, టమాటో, పైనాపిల్, వెల్లుల్లి, పొట్లకాయ, దోసకాయ, క్యాబెజ్, బీట్రూట్, చిక్కుడు వంటి కూరగాయలకు కేరళ ప్రభుత్వం కనీస ధర నిర్ణయింది. ఒకవేళ మార్కెట్ ధర.. కనీస ధర కంటే తక్కువగా ఉంటే అప్పుడు ప్రభుత్వమే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తుంది. కూరగాయలకు కనీస ధర చెల్లిస్తుంది.
ఒక సీజన్లో గరిష్ఠంగా 15 ఎకరాల్లో సాగు చేసే రైతులు ప్రభుత్వ నిర్ణయం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. మార్కెట్కు వచ్చే పంట నాణ్యత ఆధారంగా కనీస ధర నిర్ణయిస్తారు. ఈ విధంగా సేకరించిన కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయ శాఖ మార్కెట్లు , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా విక్రయిస్తుంది.
కేరళలో వరి సాగు పెరిగిందని, కూరగాయలు ఉత్పత్తులు రెట్టింపై 7 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 14.72 లక్షల మెట్రిక్ టన్నులకు చేరినట్లు విజయన్ తెలిపారు.