దిల్లీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు కోరుకుంటున్నట్లు తెలిపారు. రాంలీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కేజ్రీవాల్. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ విజయం ప్రజలదే అని ఉద్ఘాటించారు.
"దిల్లీని ప్రపంచంలో నెం.1గా తీర్చిదిద్దుతాం. దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రికి కూడా ఆహ్వానం పంపించాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. దిల్లీని ముందుకు తీసుకెళ్లాడనికి, అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ వేదిక నుంచే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆశీస్సులు కోరుతున్నా."-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
దిల్లీ ప్రజలు దేశ రాజకీయాలను మార్చేశారని కితాబిచ్చారు కేజ్రీవాల్. వచ్చే ఐదేళ్ల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. దిల్లీని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా కేజ్రీ పాడిన పాట అభిమానులను, కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది.