కశ్మీరు సమస్య కచ్చితంగా పరిష్కారమౌతుందని, భూమ్మీద ఉన్న ఏ శక్తీ దాన్ని ఆపలేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. 'ఆపరేషన్ విజయ్' 20వ వార్షికోత్సవం పురస్కరించుకుని కార్గిల్ యుద్ధంలో మరణించిన అమరజవాన్లకు ఆయన నివాళులు అర్పించారు.
జమ్ముకశ్మీర్ డ్రాస్ సెక్టార్ వద్ద ఉన్న అమరవీరుల స్మారకం ఆవరణలో ఉన్న వీరభూమిని రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ఆయన వెంట కేంద్రమంత్రి జితేంద్రసింగ్, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్‌రావత్ ఉన్నారు.
కథువాలోని ఉఝ్, సాంబా జిల్లాల్లోని బసంతర్ వద్ద సరిహద్దు రహదారుల సంస్థ రూ.50కోట్ల ఖర్చుతో నిర్మించిన రెండు వంతెనలను రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా..కశ్మీర్‌ను ప్రపంచ పర్యటక స్వర్గంగా మార్చాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆయన అన్నారు.
"కశ్మీర్ సమస్య పరిష్కారం కాబోతోంది. ఈ భూమిపై ఉన్న ఏ శక్తీ దానిని ఆపలేదు."- రాజ్‌నాథ్‌సింగ్, రక్షణమంత్రి
కశ్మీర్‌ను ఉగ్రవాద రహితంగా చేస్తాం..
జమ్ముకశ్మీర్ లోయను నరకంగా మార్చిన ఉగ్రవాదులను భారత సైన్యం అంతమొందిస్తుందని, త్వరలోనే ఈ నేల ఉగ్రవాద రహిత రాష్ట్రంగా మారబోతోందని రాజ్‌నాథ్‌సింగ్ ఉద్ఘాటించారు.
కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. భారత సైన్యం 'ఆపరేషన్ ఆల్-అవుట్'ద్వారా ఉగ్రవాదుల వెన్నెముక విరిచేస్తుందని, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని రక్షణమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
చర్చలకు ఆహ్వానిస్తున్నాం..
కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఈ కారణంగానే వేర్పాటువాదులను, వారి నాయకులను పదేపదే చర్చలకు ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: 'కజకిస్థాన్ ప్రెసిడెంట్స్ కప్'లో శివ థాపకు స్వర్ణం