జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన అల్లర్లను సద్దుమణిచేందుకు కృషి చేయాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు సూచించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వర్సిటీ ప్రతినిధులను చర్చలకు పిలవాలని కోరారు. అదే సమయంలో మానవ వనరుల మంత్రిత్వ శాఖ కూడా ఘటనపై జేఎన్‌యూ ప్రతినిధులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
కేసు నమోదు...
జేఎన్‌యూలో హింసాత్మక ఘటనకు కారణమైన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లర్లు, ఆస్తుల ధ్వంసం కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.
కట్టుదిట్టమైన భద్రత
విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. హాస్టళ్లు, పరిపాలన భవనం, ఇతర స్థలాల్లో పోలీసులను మోహరించారు. మీడియా సహా బయటి వ్యక్తులను వర్సిటీలోకి అనుమతించడం లేదని సమాచారం.
'సంయమనం పాటించండి'
ఘటనపై విద్యార్థులందరూ సంయమనం పాటించాలని వారి తరగతులకు హాజరు కావాలని కోరారు వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం.జగదీశ్ కుమార్. విద్యార్థులకు చదువుకునే పరిస్థితులు కల్పించడమే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు.
ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్, బీఎస్పీ సహా పలు పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ జరిగింది..
ముసుగులు ధరించిన పలువురు వ్యక్తులు ఇనుపరాడ్లు, హాకీ స్టిక్‌ల వంటి వాటితో ఆదివారం రాత్రి విద్యార్థులు, అధ్యాపకులు లక్ష్యంగా దాడి చేశారు. ఈ ఘటనలో క్యాంపస్‌లోని ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో 34మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నేడు డిశ్చార్జీ అయ్యారు.
ఇదీ చూడండి: మరోసారి జేఎన్‌యూలో ఉద్రిక్తత.. విద్యార్థులపై దాడి