దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో జనవరి 5న జరిగిన హింసాత్మక దాడికి వర్సిటీ ఉపకులపతే ప్రధాన సూత్రధారి అని కాంగ్రెస్ నిజనిర్ధరణ కమిటీ ఆరోపించింది.
- ఇదీ చూడండి: జేఎన్‌యూ: విలువల నిలయంలో ఎందుకీ వివాదాలు?
జగదీశ్ కుమార్‌ను వీసీగా వెంటనే తొలగించి ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జేఎన్‌యూ ఘటనపై... వాస్తవాలను పరిశీలించేందుకు నలుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధరణ కమిటీని కాంగ్రెస్ పార్టీ నియమించింది.
విశ్వవిద్యాలయం భద్రతా సంస్థ వైఫల్యం వల్లే విద్యార్థులపై దాడి జరిగిందని ఈ కమిటీ తేల్చింది. వెంటనే భద్రతా సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయాలని నివేదికలో కోరింది. అలాగే దాడికి సహకరించిన అధ్యాపక సభ్యులపై కూడా క్రిమినల్ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది.
ఏం జరిగింది?
జనవరి 5 రాత్రి కొందరు ఆగంతుకులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ముసుగులు ధరించి కర్రలు, ఇనుప రాడ్లు, సుత్తులు వంటివాటితో విరుచుకుపడ్డారు. వసతి గృహాల్లోని అద్దాలు, ఫర్నీచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు అయిషీ ఘోష్ సహా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడింది మీరంటే మీరంటూ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.
- ఇదీ చూడండి: ఇక చంద్రబాబు చుట్టూ 'బ్లాక్ క్యాట్స్' ఉండరు!