ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. నక్సల్ ప్రభావిత రాష్ట్రంలోని 81 నియోజకవర్గాలకు నవంబర్ 30 నుంచి ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 23న ఎన్నికల ఫలితం వెలువరించనున్నట్లు తెలిపింది.
ఝార్ఖండ్‌లో 2014లోనూ ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది ఈసీ.
ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్-2019
- తొలి దశ(13నియోజకవర్గాలు): నవంబర్ 30
- రెండో దశ(20నియోజకవర్గాలు): డిసెంబర్ 7
- మూడో దశ(17నియోజకవర్గాలు): డిసెంబర్ 12
- నాల్గవ దశ(15నియోజకవర్గాలు): డిసెంబర్ 16
- ఐదవ దశ(16నియోజకవర్గాలు): డిసెంబర్ 20
ఫలితాలు: డిసెంబర్ 23
ఎస్టీ జనాభా ఎక్కువగా ఉండే ఝార్ఖండ్‌లో భాజఫా అధికారంలో ఉంది. ఈసారి కాషాయదళాన్ని గద్దె దించాలని జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతోంది కాంగ్రెస్.
మహా, హరియాణా ఫలితాలతో జోష్
ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రెండు రాష్ట్రాల్లో అధికార భాజపా అతిపెద్ద పార్టీగా నిలిచినా... అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రతిపక్షాలు తమ సీట్ల సంఖ్యను మెరుగుపరుచుకున్నాయి. రెండు రాష్ట్రాల్లో భాజపా బలం తగ్గింది.
ఈ ఫలితాలే ఝార్ఖండ్‌లోనూ పునరావృతం చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. భాజపా పాలనలో జార్ఖండ్‌లో అభివృద్ధి జరగలేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.
రఘుబర్ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ప్రచారం చేయాలని భాజపా భావిస్తోంది.
2014 ఎన్నికల్లో ఇలా...
ఝార్ఖండ్‌లో 81 స్థానాలకుగాను 2014 నవంబర్ 25-డిసెంబర్ 20 మధ్య ఐదు దశల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా 37 స్థానాల్లో విజయం సాధించింది. ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (5)తో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రఘుబర్‌దాస్ బాధ్యతలు చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకే పరిమితమైంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా 19, ఝార్ఖండ్ వికాస్ మోర్చా 8 సీట్లు సాధించాయి.
ఎప్పుడు అస్థిర ప్రభుత్వం ఉండే ఝార్ఖండ్‌లో ఐదేళ్ల పూర్తికాలం సీఎం పదవి చేపట్టి అరుదైన ఘనత సాధించారు రఘుబర్. ప్రస్తుత శాసనసభ కాల పరిమితి జనవరి 5తో ముగుస్తుంది.
ఇదీ చూడండి: వాట్సాప్‌పై కేంద్రం అసహనం.. 'పెగసస్'పై వివరణకు ఆదేశం