జేఈఈ మెయిన్స్ పరీక్షలను వచ్చే ఏడాదిలో నాలుగు సెషన్లుగా నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. తొలి సెషన్‌ను ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహిస్తామన ప్రకటించారు. తదుపరి సెషన్ల తేదీలు తరువాత ప్రకటించనున్నట్లు తెలిపారు. చివరి పరీక్ష పూర్తైన నాలుగైదు రోజుల్లోనే ఫలితాలను ప్రకటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఫలితాల తర్వాత తదుపరి సెషన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
జనవరి 16 వరకు అవకాశం..
జేఈఈ మెయిన్స్ పరీక్ష కోసం 2020 డిసెంబర్ 16 నుంచి 2021 జనవరి 16వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది కేంద్రం. ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడూ పరీక్షలు నిర్వహించనున్న ఎన్టీఏ.
దరఖాస్తుల ఉపసంహరణకు అవకాశం..
సెషన్ల వారిగా ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఒక సెషన్లో వచ్చిన ఫలితం ఆధారంగా విద్యార్థులు తదుపరి సెషన్ల కోసం చేసిన దరఖాస్తులు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది కేంద్రం. ఇందు కోసం చెల్లించిన రుసుమును తిరిగి చెల్లించనుంది ఎన్టీఏ. ఏ సెషన్లో పరీక్షకు హాజరుకావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను విద్యార్థులకు కల్పించింది.
జేఈఈ మెయిన్స్ 2021 పరీక్ష అంతా.. కంప్యూటర్ ఆధారంగా ఉంటుందని తెలిపారు కేంద్ర మంత్రి. అయితే.. బీఆర్చ్ డ్రాయింగ్ టెస్ట్ మాత్రం పెన్ అండ్ పేపర్ (ఆఫ్‌లైన్)లో నిర్వహిస్తామని తెలిపారు.
తొలిసారి ప్రాంతీయ భాషల్లో..
అయితే.. ఈ దఫా జేఈఈ మెయిన్స్ పరీక్షలను కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంలో కేంద్రం నిర్వహించనుంది. దీని ప్రకారం 13 భాషల్లో విద్యార్థులు పరీక్షలు రాయవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలి, గుజరాతి, కన్నడ, ఒడియా, పంజాబీ, ఉర్దూ భాషల్లో ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉంటాయి.
సిలబస్‌లో సవరణలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ బోర్డులు తీసుకున్న నిర్ణయాలను దృష్టిలో ఉంచుకుని 90 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం తయారు చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. అందులో 75 ప్రశ్నలు పరిష్కరించాల్సి ఉంటుంది. 15 ఐచ్ఛిక ప్రశ్నలలో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని స్పష్టం చేసింది. ఉత్తమ ఎన్టీఏ స్కోరు ఆధారంగా మెరిట్ జాబితా లేదా ర్యాంకింగ్ ఖరారు చేయనున్నారు.
ఇదీ చూడండి: స్మృతివనంతో 'బాలు'కు అభిమానుల ఘన నివాళి