మొదటి దశ లోక్‌సభ ఎన్నికల నామినేషన్ దాఖలుకు గడువు ముగిసింది. ఈ తరుణంలో కర్ణాటక సంకీర్ణ రాజకీయాల్లో ఊహాతీత మలుపు చోటుచేసుకుంది. కూటమి ఒప్పందంలో తమకు కేటాయించిన ఉత్తర బెంగళూరు స్థానాన్ని కాంగ్రెస్‌కే వదిలేసింది జేడీఎస్.
చివరి క్షణంలో జేడీఎస్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 28 స్థానాల్లో 12 ఇవ్వాలని డిమాండ్ చేసిన పార్టీ... లభించిన 8 స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్‌కే తిరిగివ్వడం ఆశ్చర్యకరమే. ఆ స్థానంలో సరైన అభ్యర్థి లేకపోవటమే జేడీఎస్ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. తుమకూరు నుంచి దేవేగౌడ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
ఉత్తర బెంగళూరులో ఓటమి భయమే కారణమా?
జేడీఎస్ అగ్రనేత దేవేగౌడ ఉత్తర బెంగళూరు నుంచి పోటీకి దిగుతారని మొదట్లో వార్తలొచ్చాయి. దీనిపై పార్టీలో భిన్నస్వరాలు వినిపించాయి. సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ స్థానంలో ఉన్న వారిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ ముఖ్యమంత్రి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందనే భయాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఉత్తర బెంగళూరు స్థానం నుంచి జేడీఎస్ వైదొలిగిందనే వాదన ఉంది. దేవేగౌడ తుమకూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
తుమకూరులోనూ తప్పని పోటీ
ఉత్తర బెంగళూరు లోక్‌సభ స్థానం నుంచి తుమకూరుకు మారారు దేవేగౌడ. కానీ ఇక్కడా కాంగ్రెస్ రెబల్స్ నుంచి పోటీ తప్పేలా లేదు.
తుమకూరు స్థానానికి నేడు నామినేషన్ దాఖలు చేశారు మాజీ ప్రధాని దేవేగౌడ. ఆయనతో పాటు ప్రస్తుత తుమకూరు కాంగ్రెస్ ఎంపీ ముద్దహనుమేగౌడ కూడా నామినేషన్ వేశారు. మరో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేఎన్ రాజన్న ఇదే స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ టికెట్‌పై ముద్దహనుమేగౌడ ఆశాభావం
కూటమి ఒప్పందంలో భాగంగా తుమకూరు స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించింది కాంగ్రెస్. కానీ ఆ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ ముద్దహానుమేగౌడ నామినేషన్ వేయడం వల్ల ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేశానని, తనకు పార్టీ టికెట్ కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముద్దహనుమేగౌడ.
" కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేశాను. సరదా కోసం పత్రాలు సమర్పించలేదు. నేను తుమకూరు పార్లమెంటు సభ్యుడిని. నేనూ పోటీ చేస్తున్నా. వేరే స్థానం నుంచి పోటీ చేయటానికి నాకు అధికారం లేదు. అలా చేయకూడదు కూడా. రేపు నామినేషన్ దాఖలుకు చివరి తేదీ. పార్టీ టికెట్ ఇస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నా. రాజకీయంలో ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. రేపు 3 గంటల వరకు సమయం ఉంది. వేచి ఉంటా." - ముద్దహనుమే గౌడ, తుముకూరు ప్రస్తుత ఎంపీ
కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరిన నేతలు
కూటమి ఒప్పందంలో భాగంగా కేటాయించిన తుమకూరు స్థానాన్ని తిరిగి కాంగ్రెస్‌కు ఇచ్చేయాలని జేడీఎస్‌కు సీట్ల సర్దుబాటు సమయంలోనే విన్నవించారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర, ముద్దహానుమేగౌడ. జేడీఎస్‌తో తిరిగి సంప్రదింపులు జరపాలని పార్టీ అధిష్టానాన్ని సైతం కోరారు.
జేడీఎస్‌కు కేసీ వేణుగోపాల్ కృతజ్ఞతలు
ఉత్తర బెంగళూరు సీటును కాంగ్రెస్‌కు అప్పగించటంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్ జేడీఎస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
" ఉత్తర బెంగళూరు స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చినందుకు హెచ్డీ దేవేగౌడ, జేడీఎస్‌కు జాతీయ కాంగ్రెస్ కృతజ్ఞతలు తెలుపుతోంది. ఇరువురం కలిసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిద్దాం." - కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.