దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు, రోడ్లు ఇలా ఎటు చూసినా నిర్మానుష్యమే.. ఎక్కడ చూసినా నిశ్శబ్దమే. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు జనతా కర్ఫ్యూను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు.
అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్ అయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడం వల్ల రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మూసివేసి స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారు ప్రజలు.
ప్రధాన ప్రాంతాల్లో ఇలా...
ఎప్పుడూ రద్దీగా ఉండే కర్ణాటక బెంగళూరు రహదారులు వాహనాలు లేక నిర్మానుష్యంగా ఉన్నాయి.
తమిళనాడు ధర్మబురిలో దుకాణాలన్నీ మూసివేశారు. ఎక్కడా జనసంచారమే లేదు.
కేరళ కొల్లాంలో రోడ్డుపై ఒక్కరు కూడా కనిపించడం లేదు.
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జమ్మూలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.
హిమాచల్ ప్రదేశ్ సొలంగ్ లోయలో ఎక్కడా ప్రజలు బయటకు రాలేదు.
హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో దుకాణాలు సహా వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి.
ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూ రైల్వేస్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోతోంది.
దిల్లీ కనాంట్ ప్రాంతంలో వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
- ఇదీ చూడండి: ట్రాఫిక్ జామ్ లేని బెంగళూరు రోడ్లు ఎప్పుడైనా చూశారా?
- ఇదీ చూడండి: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 'జనతా కర్ఫ్యూ'