జమ్ముకశ్మీర్ కథువా జిల్లాలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. చీనాబ్ వస్త్ర కర్మాగారంలో పనిచేసే కార్మికులు.. తమకు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మిల్లును ధ్వంసం చేస్తూ.. హింసాత్మక పరిస్థితులను సృష్టించారు. తమకు పనులు ఇవ్వకుండా, పూర్తి వేతనాలూ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు కార్మికులు. ఇలాంటి పరిస్థితుల్లో చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమని కోపోద్రిక్తులైన వందలాది కూలీలు విధ్వంసానికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న కథువా పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మిల్లు యాజమాన్యంతో సంబంధిత అంశంపై మాట్లాడతామని నచ్చజెప్పారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు.
చీనాబ్ వస్త్ర కర్మాగారంలో దాదాపు 6 నుంచి 7 వేల మంది కార్మికులు పనిచేస్తుంటారని, కరోనా లాక్డౌన్ కారణంగానే పరిశ్రమ మూతపడిందని చెప్పారు కథువా ఎస్ఎస్పీ శైలేంద్ర మిశ్రా. ఈ నేపథ్యంలోనే కార్మికులు తమకు పూర్తి వేతనాలు చెల్లించి, ఇంటికి పంపించాలని డిమాండ్ చేసినట్లు వివరించారు.