ఇటీవల కేంద్రం నిషేధం విధించిన ముస్లిం సంస్థ జమాతే ఇస్లామి అగ్రనేతలు ముగ్గురుని జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరు జిల్లాల్లోని 12 జమాతే ఆస్తుల్ని జప్తుచేశారు. ఆరు జమాతే బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను నిలిపివేశారు.
ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలున్నాయన్న కారణంతో జమాతేపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. నేతలతో సహా మరో 150 మంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. జమాతే అధీనంలోని పాఠశాలల్లోనూ అధికారులు సోదాలు చేశారు.
కాంగ్రెస్ విమర్శ
జమాతేపై నిషేధం విధించడంపై కశ్మీర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జీ ఎం సరూరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమాతే ఇస్లామి కశ్మీర్లో ఆరు దశాబ్దాలుగా 300 పాఠశాలల్ని నిర్వహిస్తోందన్నారు. ఉగ్రవాదులకు సహకరిస్తోందని ఏదైనా సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.