యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై రాజస్థాన్ జైపూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి పొందకుండా 'కరోనిల్' పేరుతో ఓ ఔషధాన్ని ఆవిష్కరించడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.
కరోనాను నయం చేసే ఔషధమంటూ రామ్‌దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి సంస్థ 'కరోనిల్'ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి లేదు. అందుకే పతంజలి ఎండీ రామ్‌దేవ్ బాబాతో పాటు ఆయుర్వేద ఆచార్య బాలకృష్ణ; జైపూర్ నిమ్స్ డైరెక్టర్ బీఎస్ తోమర్, అతని కుమారుడు అనురాగ్ తోమర్, సీనియర్ శాస్త్రవేత్త అనురాగ్ వర్షిణీలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఏడు రోజుల్లోనే..!
మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధిని కేవలం ఏడు రోజుల్లోనే కరోనిల్ నయంచేస్తుందని.. హరిద్వార్ కేంద్రంగా పనిచేస్తున్న పతంజలి సంస్థ పేర్కొంది. జైపూర్‌కు చెందిన ప్రైవేటు సంస్థ నిమ్స్ సహకారంతో ఈ ఔషధాన్ని రూపొందించినట్లు వెల్లడించింది.
దీనితో ఆయుష్ మంత్రిత్వశాఖ.. కరోనిల్ ఔషధంపై జరిగిన పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ వివరాలు తమకు తెలియజేయాలని పతంజలి సంస్థను ఆదేశించింది. దీని పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేంత వరకు.. కరోనిల్ ప్రకటనలను ఆపాలని స్పష్టం చేసింది.
పతంజలి సంస్థపై పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. దీనితో రామ్‌దేవ్‌బాబాతో పాటు మిగతా నలుగురిపై.. ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీసీ (అభ్యంతరకర ప్రకటనలు) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
చట్టబద్ధత ఉంది..
అయితే తాము అన్ని చట్టబద్ధ నియమాలు పాటించినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది. 'అశ్వగంధ, గిలోయ్, తులసి మొదలైన ఔషధాలకు సంబంధించిన సంప్రదాయ జ్ఞానం, అనుభవం ఆధారంగా కరోనిల్ని రూపొందించాం... దీనికి లైసెన్స్ కూడా పొందాం' అని పతంజలి ప్రతినిధి ఎస్.కె.టిజారావాలా తెలిపారు.
ఇదీ చూడండి: డెక్సామెథసోన్ ఉపయోగించేందుకు కేంద్రం అనుమతి