కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అమర్నాథ్ పవిత్ర గుహ దర్శనం.. ఎత్తైన హిమాలయ పర్వతాల నడుమ ఎంతో క్లిష్టమైన యాత్ర. మంచు లింగాన్ని దర్శించేందుకు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సిందే. ఇక్కడ ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువ. అయితే యాత్రికులకు ఇండో టిబెటిన్ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ) అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సాయం అందిస్తున్నారు.
దారిలో ఎత్తయిన కొండలు దాటేటప్పుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా పూర్తి రక్షణ కల్పిస్తున్నారు. ఇరుకుగా, వాలుగా ఉండే దారుల్లో చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఆక్సిజన్ అందక అస్వస్థతకు గురైతే మాస్క్, స్ప్రే ద్వారా ప్రాణవాయువు అందిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడినా వాటికి అడ్డుగా నిలుస్తూ యాత్రికుల ప్రాణాలకు భరోసా ఇస్తున్నారు. ఇలా అడుగడుగునా భద్రత కల్పిస్తూ మహా శివుడ్ని దర్శించుకునేందుకు మార్గం సులభం చేస్తున్నారు.
అత్యంత కఠినమైన యాత్ర కావటం వల్ల విడతల వారీగా భక్తులకు అనుమతులు ఇస్తోంది ప్రభుత్వం. 46 రోజుల పాటు సాగే ఈ యాత్రకు 1.5లక్షలకు పైగా భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. మొదటి బ్యాచ్‌లో సుమారు 2,200 మంది భక్తులు ఉన్నారు. యాత్రకు దాదాపు 30వేల మందికి పైగా పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.