కర్ణాటక ఉపఎన్నికలకు ముందు విపక్ష పార్టీ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. తాజాగా రాణెబెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కోలివాద్ నివాసంలో ఆదాయపు పన్నుశాఖ, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
గతంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కోలివాద్ నివాసంలో... మద్యం, నగదు నిల్వలు ఉన్నాయన్న ఫిర్యాదుపై మంగళవారం రాత్రి ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
"కోలివాద్ నివాసంలో మద్యం, రూ.10 కోట్లు మేర నగదు ఉన్నట్లు ఫిర్యాదు వచ్చింది. అయితే తనిఖీల్లో మద్యం, నగదు దొరకలేదు." - నాగశయన్, హవేరీ ఎక్సైజ్ చీఫ్
రాజకీయ ప్రతీకారచర్య!
ఐటీ దాడులపై కోలివాద్ తీవ్రంగా స్పందించారు.
"భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష నేతలపై రాజకీయ ప్రతీకార చర్యలకు పూనుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పి.చిదంబరం, డీకే శివకుమార్‌లు ఈ వేధింపులకు గురయ్యారు. మంగళవారం రాత్రి... అధికారులు నా నివాసంలో తనిఖీలు చేశారు. ఏమీ దొరకక ఉత్తచేతులతో వెళ్లారు." - కోలివాద్, కాంగ్రెస్ నేత
కార్యకర్తల ఆగ్రహం
కోలివాద్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వాహనాల ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు.
ఇదీ చూడండి: పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం!