2021 డిసెంబర్ లోపు చేపట్టాలని భావిస్తున్న మానవ సహిత గగన్‌యాన్ ప్రయోగం కోసం రాకెట్‌లో వినియోగించేందుకు హరిత ఇంధనాన్ని అభివృద్ధి చేస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం శాస్త్ర, సాంకేతిక విద్యాసంస్థ స్నాతకోత్సవంలో పాల్గొన్న శివన్ భారత్ అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారించాలంటే హరిత సాంకేతికత ద్వారా పర్యావరణ నష్టాన్ని పరిమితం చేసుకోవాలని సూచించారు. అందులో భాగంగానే గగన్‌యాన్ మానవ సహిత రాకెట్ ప్రయోగంలో ఇస్రో హరిత ఇంధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
రాకెట్‌లోని ప్రతి దశలోనూ ఇలాంటి ఇంధనాన్నే ఉపయోగించే అవకాశం ఉందని వివరించారు. భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని రాకెట్ ప్రయోగాల్లోనూ హరిత ఇంధనాన్నే వినియోగించే అవకాశాలు ఉన్నాయని శివన్ తెలిపారు.
ఇదీ చూడండి: గగన్‌యాన్‌పై కరోనా ప్రభావం- ఏడాది వాయిదా