దిల్లీ పేలుడు కేసును కేంద్ర హోంశాఖ.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో గత నెల 29న జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే దిల్లీ పోలీసు స్పెషల్ సెల్, దిల్లీ ఫోరెన్సిక్, ఇంటిలిజెన్స్ బ్యూరో దర్యాప్తు చేపట్టాయి.. నేషనల్ సెక్యూరిటీ గార్డు బృందం ఇప్పటికే ఘటనాస్థలాన్ని సందర్శించి ఆధారాలను సేకరించింది.
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద తక్కువ సామర్థ్యంతో పేలుడు సంభవించినట్లు పోలీసు విచారణ బృందం నిర్ధరించింది. దేశంలో ఎటువంటి పేలుడు సంభవించినా ఎన్ఐఏ విచారించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు కేసును కూడా ఎన్ఐఏకి అప్పగించినట్టు తెలుస్తోంది.
పేలుడుకు కారణమైన వారిని శిక్షిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు హామీనిచ్చారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీనిపై మోదీకి కృతజ్ఞతలు తెలిపారు నెతన్యాహు.
ఇదీ చూడండి:- 'దిల్లీ' పేలుడులో ఇరాన్ హస్తం!