పాస్‌పోర్ట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు చిప్ పొందుపరిచిన ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేయనున్నట్లు వెల్లడించారు విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్. ‘‘చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌ల కోసం ప్రస్తుతం ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ-పాస్‌పోర్ట్ ప్రయాణ పత్రాలకు మరింత భద్రత కల్పిస్తుందని వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్న జైశంకర్.. ప్రస్తుతం ఈ- పాస్‌పోర్ట్‌ల అవసరం ఎంతో ఉందని నొక్కి చెప్పారు.
ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో..
పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కే) లేని ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో త్వరలో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు మంత్రి. ఇప్పటి వరకు 488 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఈ సేవలు అందించామని.. ఎంతో వేగంగా పూర్తి చేయాల్సిన ఈ కార్యక్రమం కరోనా కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పారు. వీటిని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక సులభతరంగా పాస్‌పోర్ట్ జారీ..
పాస్‌పోర్ట్ జారీ మరింత సులభతరం చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి. పాస్‌పోర్ట్ సేవా దివస్‌ను పురస్కరించుకొని భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న పాస్‌పోర్ట్ జారీ అధికారులను సత్కరించనున్నట్లు తెలిపారు. '‘మనమంతా ప్రత్యేక పరిస్థితుల్లో కలుస్తున్నాం. అందుకు మీ అందర్ని అభినందిస్తున్నాను. కరోనా కారణంగా మారుతున్న ప్రజా అవసరాల దృష్ట్యా మీరు స్పందించిన తీరును నేను గుర్తించాను'’’అని మంత్రి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సిబ్బందిని ఉద్దేశించి అన్నారు.
ముందంజలో తెలుగు రాష్ట్రాలు..
దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ జారీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.
ఇదీ చూడండి: చైనా డీల్‌పై చిక్కుల్లో సోనియా, రాహుల్!