ఒక మహమ్మారి ‘కొత్త’గా కల్లోలం రేపుతోంది. దాని ఆనుపానులు అంతుచిక్కట్లేదు. దాన్నుంచి తేరుకోవడం, ఆ మహమ్మారి అంతు చూడటం ఇప్పుడు విశ్వ మానవాళి ముందున్న పెను సవాలు. కరోనా వైరస్‌కు ఇంకా మందు రాలేదు. దీన్ని తయారుచేయడానికి ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలంతా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఈ దశలో కరోనా ఎంత ప్రమాదకరమో.. అది ఎలా పంజా విసురుతుందో.. దీన్ని ఎలా ఆపగలమో ప్రతి పౌరుడూ తెలుసుకోవాలి. ఇలాంటి వైరస్‌ల నివారణకు ప్రజల అప్రమత్తత అత్యంత కీలకం అంటున్నారు ప్రఖ్యాత వైరాలజీ నిపుణుడు పీటర్ పయెట్. జాగ్రత్తలు తీసుకోకుంటే ఇది అదుపుచేయలేని పరిస్థితికి చేరుకోవచ్చునని ఆయన హెచ్చరిస్తున్నారు.
వైరస్‌లు, టీకాలు, మందులు, వాటి నివారణపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న పయెట్ అమెరికాకు చెందిన, వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్న ప్రఖ్యాత ‘టెడ్‌మెడ్ ఫౌండేషన్’ నిర్వహించిన ముఖాముఖిలో ఎన్నో అంశాలను వెల్లడించారు.
వైరస్‌ల వేటగాడు పీటర్ పయెట్
వైరస్‌ల గుట్టుమట్లు తేల్చడంలో, వాటి ఆట కట్టించడంలో దిట్ట పీటర్ పయెట్. ‘వైరస్‌ల వేటగాడు’ అని కూడా అయనకు పేరు. 1949లో బెల్జియంలో జన్మించిన పయెట్ ఇదే పనిలో దేశాలను చుట్టేస్తున్నారు. ప్రపంచఖ్యాతిని ఆర్జించారు. 1976లోనే ఎబోలా వైరస్‌ను కనుగొనడంలో కీలక భూమిక పోషించారు. ఎబోలా, ఎయిడ్స్ నియంత్రణకు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రముఖ దాతృత్వ సంస్థలు ఫోర్డ్, మిలిందా-గేట్స్ ఫౌండేషన్లతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా 600 పరిశోధక వ్యాసాలు, 17 పుస్తకాలు రాశారు. ఆరోగ్య, ఔషధ రంగాల్లో పరిశోధనలకు ఎన్నో అవార్డులు పొందారు. ప్రస్తుతం లండన్‌లోని పరిశుభ్రత, ఉష్ణమండల వ్యాధుల అధ్యయన సంస్థకు సంచాలకుడిగా పనిచేస్తున్నారు.
సూక్ష్మాతి సూక్ష్మం
కొత్త కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం ఎందుకు కష్టమవుతోంది
ఇది పరిమాణం రీత్యా అత్యంత సూక్ష్మమైనది. ఎంత చిన్నదంటే ఒకసారి దగ్గితే గాల్లోకి వచ్చే తుంపర్లలో ఈ వైరస్‌లు కొన్ని వందల కోట్లలో ఉంటాయి. ఒక సూదిమొనపై 10 కోట్లు వరకూ ఉంటాయంటే ఎంత సూక్ష్మమో అర్ధం చేసుకోవచ్చు.
ఈ వైరస్ చూడటానికి ఎలా ఉంటుంది
‘సార్స్-కొవ్2’గా పిలిచే ఈ వైరస్ ఒక నూడుల్ లాంటి చిన్నపోగును ఒక బంతిలో ప్యాక్ చేసినట్లుంటుంది. అంతా ప్రొటీన్‌తో తయారై ఉంటుంది. ఆ గోళాకృతిపై చిన్న మొనల్లాంటి ఆకృతులు(స్పైక్స్) ఉంటాయి. మొత్తంగా చూస్తే సూర్యుడి బాహ్యవలయం ‘కరోనా’ మాదిరిగా కనిపిస్తుంటుంది. నిజానికి ఈ జాతికి చెందిన వైరస్‌లన్నీ ఇలాగే కనిపిస్తాయి.
రోగ నిరోధకం?
దీన్ని ‘నావెల్’ కరోనా వైరస్ అని ఎందుకు పిలుస్తున్నారు
ఇక్కడ నావెల్ అంటే మనుషులకు ‘కొత్తగా’ సోకుతున్న వైరస్ అని అర్థం. అంటే ఇంతకుముందు మనం దీన్ని చూడలేదు. మన రోగనిరోధక వ్యవస్థ 20 లక్షల సంవత్సరాలుగా పరిణామం చెందుతూ వస్తోంది. కానీ మునుపెన్నడూ ఇలాంటి వైరస్‌ను చూడలేదు. అందువల్ల ఈ వైరస్‌కు రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేకపోయింది. ప్రస్తుతానికి దీన్ని ఎదుర్కొనే శక్తిని మన రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చేసుకోలేకపోవడంతో పాటు వైరస్ కూడా శక్తిమంతమైంది కావడంతో సులువుగా వ్యాప్తి చెందగలుగుతోంది. ఇది ప్రమాదకరంగా మారడం వల్లే ఎక్కువ కల్లోలం సృష్టిస్తోంది.
కొత్త వైరస్ ఎంత సులువుగా వ్యాప్తి చెందుతుంది
దగ్గు తుంపర్లు, స్పర్శ ద్వారా ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులువుగా వ్యాప్తి చెందుతుంది. ఇది శ్వాస సంబంధిత మార్గాల ద్వారా వ్యాప్తి చెందే వైరస్.
ఎలాంటి లక్షణాలు లేకుండానే కొందరు ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారా
దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది. ఈ వైరస్ సోకిన చాలామందిలో తొలి కొద్దిరోజులు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత కొద్దిగా దగ్గు లేదా స్వల్పంగా జ్వరం కనిపిస్తుంది. సార్స్ ఇలా కాదు. సార్స్ వైరస్ సోకితే కొద్ది రోజులు తీవ్ర లక్షణాలు ఉంటాయి. ఇది సోకిన వాళ్ల నుంచి అప్పుడే ఇతరులకు అంటుతుంది.
7 రకాలు
ఎన్ని రకాల కరోనా వైరస్‌లు మనుషులపై ప్రభావం చూపిస్తుంటాయి
మొత్తం 7 రకాల కరోనా వైరస్‌లు మనిషి నుంచి మనిషికి సోకుతుంటాయి. వీటిలో 4 అంత ప్రమాదకరమైనవేమీ కావు. వీటిద్వారా కొంచెం జలుబు వచ్చి తగ్గిపోతుంది. మిగతా 3 రకాలు మాత్రం ప్రమాదకరమైనవి. అవే సార్స్, మెర్స్, ప్రస్తుతం విస్తరిస్తున్న కొత్త వైరస్ సార్స్-కొవ్2.
మరణాల రేటు
కొత్త వైరస్ ఎంత ప్రమాదకరం
కరోనా సోకినవారిలో 1-2 శాతం మందిలో మరణాలు సంభవిస్తున్నట్లు ఎక్కువమంది శాస్త్రవేత్తలు అంచనాకొస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం మరణాల రేటు 3 శాతానికి పైగా ఉండొచ్చని చెబుతోంది. అయితే నమోదుకాని, స్వల్పస్థాయి కేసులను కూడా పరిగణనలోకి తీసుకుంటే మరణాల శాతం ఇంతకంటే తక్కువే ఉండే అవకాశం ఉంది. వయోవృద్ధులు, ఇతరత్రా ఆరోగ్య పరిస్థితులున్న వారిలోనూ మరణాల రేటు 10-15% వరకు ఉంటోంది. వృద్ధులతో పాటు మధుమేహం, తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులున్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు ఎందుకు అధికంగా ప్రభావితం అవుతున్నారనే విషయాన్ని కనుగొనడానికి కొంత సమయం పట్టొచ్చు.
తీవ్రత స్థాయి
తట్టు, అమ్మవారు, గవద బిళ్లలతో పోలిస్తే కొత్త వైరస్ ఎంత ప్రమాదకరం?
ఇప్పటికైతే తట్టు, అమ్మోరు, గవద బిళ్లలతో పోలిస్తే కరోనా తక్కువ అంటువ్యాధే. ఇది కొత్త వైరస్ కావడం, దాని గురించి ఏమీ తెలియకపోవడం, మందులు లేకపోవడం వల్ల భయాందోళనలు పెరుగుతున్నాయి.
జ్వరం రాకున్నా కొవిడ్ సోకుతుందా
చైనాలో నమోదైన కేసుల్లో 30% మందికి జ్వరమే రాలేదు. వారు ఆసుపత్రులకు వెళితేనే అసలు విషయం తేలింది. కొవిడ్ సోకిన వారిలో 20 శాతం మందిలో మాత్రమే తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి వారిలో అధిక జ్వరం, పొడిదగ్గు, నీళ్ల విరేచనాలు, శ్వాస సమస్యలతోపాటు ఊపిరితిత్తులు వాచిపోతాయి. అలాంటివారు తప్పక ఆస్పత్రిలో చేరాలి. వీటిలో రెండు కంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
నియంత్రణ మార్గం
‘వ్యాప్తి తీవ్రతను తగ్గించడం’ అంటే ఏమిటి
అమెరికా లాంటి దేశాల్లో వైరస్ సోకిన వారి సంఖ్య ప్రతి వారం రెట్టింపవుతోంది. ఇలాంటి కొత్త మహమ్మారి ప్రబలుతున్నప్పుడు దాని ‘వ్యాప్తి తీవ్రతను తగ్గించడం’ చాలా అవసరం. వైరస్ విజృంభించి అదుపుచేయలేని పరిస్థితి ఏర్పడితే ఆసుపత్రులు, సహాయ కేంద్రాలు సరిపోవు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికాల్లో ఇదే పరిస్థితి.
ఇప్పుడు ప్రజలంతా ఏం చేయాలి
చేతులను తరచూ 20-30 సెకెన్ల పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. బయట తిరగకపోవడం ఉత్తమం. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వాలు ఏం చెబితే అది చేయాల్సిందే. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు సామాజిక పరిశుభ్రత కూడా అత్యంత ఆవశ్యకం.
కొవిడ్ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత మళ్లీ వస్తుందా
కచ్చితంగా చెప్పలేం. ఎవరైనా ఆస్పత్రుల్లో చికిత్స పొంది, డిశ్ఛార్జి అయిన కొన్ని రోజుల వరకు వారి శరీరంలో వైరస్ సుప్తచేతనావస్థలో ఉండే అవకాశముంది. అందుకే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి.
కరోనాకు ముందూ.. వెనుకా..
చరిత్రలో నిర్మూలించిన వ్యాధులు ఏమేం ఉన్నాయి
గతంలో కలరా, మశూచి, ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటివి లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. టీకాలు కనుగొనడంతో ఇప్పుడవి కనిపించడం లేదు. పోలియో కూడా నిర్మూలన దశకు చేరుకుంది.
పరిస్థితి అదుపులోకి వచ్చాక మళ్లీ కరోనా బెడద ఉండదా
ఉండదని కచ్చితంగా చెప్పలేం. గతంలో వ్యాధులపై ఎలా పోరాడామో అలాగే కొవిడ్‌పైనా చేస్తే ఫలితం ఉండొచ్చు. చైనాలో విద్యాసంస్థలు, ఫ్యాక్టరీలు తెరిచిన తర్వాత మనకు కొంత స్పష్టత రావచ్చు. ఒక సీజనల్ వ్యాధిగా ఇది ఎప్పటికీ ఉండే అవకాశమూ ఉంది.
మున్ముందు కూడా కొత్త వైరస్‌లు దాడి చేయవచ్చా
కచ్చితంగా.. మనమంతా వైరస్‌ల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇది ఎప్పటికీ కొనసాగే యుద్ధం. పరిశోధనలు, ఆవిష్కరణపై మరింత దృష్టిని కేంద్రీకరించి, ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉండటమే శరణ్యం.
నేర్పిన పాఠాలు
సానుకూల అంశాలు ఏమిటి
ఆధునిక శాస్త్ర సాంకేతిక వ్యవస్థ ఎంతో వేగంగా పనిచేస్తోంది. త్వరలో కొవిడ్-19కు మందులు, చికిత్స విధానాలను కనుగొనవచ్చు. టీకాలు కూడా రావచ్చు. ప్రపంచమంతా స్పందించి, వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించడం సానుకూలాంశం.
కరోనా నేపథ్యంలో వివిధ దేశాల్లో మీరు గ్రహించిన లోపాలేమిటి
- నిర్వహణ లోపం. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఉన్న అన్ని అవకాశాలను చేజార్చారు. ఫలితంగా వైద్యారోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలు బలవంతంగా ఇళ్లకే పరిమితమయ్యారు.
- అతి స్పందన. ఈ కారణంగా వదంతులు వ్యాపించి, ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. పేద దేశాలు ఎక్కువగా విలవిలలాడుతున్నాయి.
టీ‘కాల పరిమితి’
కొత్త కరోనా వైరస్ సోకకుండా టీకాలను (వ్యాక్సిన్) ఎంత కాలంలో అభివృద్ధి చేసే అవకాశం ఉంది
టీకాలను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా.. కచ్చితంగా వస్తాయని చెప్పలేం. విఫలమవడానికీ అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనం ఎయిడ్స్(హెచ్‌ఐవీ)కు వ్యాక్సిన్ కోసం 35 ఏళ్లుగా అన్వేషిస్తున్నా సాధ్యం కాలేదు. కొత్త కరోనా వైరస్‌కు మాత్రం వ్యాక్సిన్ వస్తుందన్న ఆశాభావంతోనే ఉన్నాను. అయితే దాన్ని చాలా సురక్షిత ప్రమాణాల్లో ప్రభావవంతంగా పనిచేస్తుందా? లేదా? అన్నది కూలంకషంగా పరీక్షించాల్సి ఉంటుంది. దీనికి ఎంతోమంది కృషి, చాలా సమయం అవసరం. ప్రముఖ అధీకృత సంస్థ ఒకటి దీన్ని ఆమోదించాలి. తర్వాత ప్రజలకు వేయడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంటుంది. లక్షల సంఖ్యలో టీకా డోసులను వృద్ధి చేసి అందుబాటులోకి తేవాలంటే 18 నుంచి 24 నెలలు కూడా పట్టొచ్చన్న అంచనాలున్నాయి.
మందులు.. మాస్కులు
త్వరలో మందులొస్తాయా
ఇప్పటివరకైతే మందులేమీ లేవు. చికిత్సలో భాగంగా చైనాలో ఇతర వైరల్ వ్యాధులకు వాడే మందులను ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. త్వరలోనే కచ్చితమైన చికిత్స విధానంతోపాటు మందులు కూడా అందుబాటులోకి రావచ్చు.
యాంటీబయోటిక్స్ ఉపయోగపడతాయా
ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ప్రతిఒక్కరూ యాంటీబయోటిక్స్ వైపు చూడటం సర్వసాధారణమైంది. అది తప్పు. వాటిని బ్యాక్టీరియాలను నిరోధించడానికే వాడతాం. వైరస్‌లకు కాదు
ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఏవేవో చికిత్స విధానాలు, మందుల పేర్లు ప్రచారం అవుతున్నాయి
ఇలా తప్పుడు సమాచారం కుప్పలుతెప్పలుగా వస్తోంది. విశ్వసనీయ పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే చదివితే సరిపోతుంది. వదంతుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవి అత్యంత ప్రమాదకరం.
మాస్కులు ఎలా ఉపయోగపడతాయి
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాస్కులు ఉపయోగపడతాయి. ఎన్-95 మాస్కులు మనం పీల్చుకునే గాలిని 50% వడపోస్తాయి. అంటే వ్యాధి వ్యాప్తిని అంతమేరకు కట్టడి చేస్తాయి. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు తుంపర్లను మాస్కులు అడ్డుకుంటాయి.
ప్రమాదానికి ‘గొంతుక’
ఇప్పటికే ప్రపంచానికి తెలిసిన ప్రమాదకరమైన సార్స్, మెర్స్ కరోనా వైరస్‌ల కంటే ఈ కొత్త వైరస్ ఎలా భిన్నమైంది
కొత్త వైరస్ ప్రధానంగా 4 విధాలుగా భిన్నమైంది.
- ఇది సోకిన చాలామందిలో కొన్ని రోజుల పాటు లక్షణాలు కనిపించడం లేదు. అలాంటివారంతా తమకు తెలియకుండానే ఇతరులకు వ్యాప్తి చేస్తున్నారు. దీంతో ఎవరిని వేరుగా ఉంచాలో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. ఇలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటమే ఆందోళన కలిగించే అంశం.
- దాదాపు 80 శాతం మందిలో కొవిడ్-19 స్వల్పంగా జలుబు లేదా దగ్గులా వచ్చే చిన్నవ్యాధి. దీంతో ఆయా వ్యక్తులు తమంత తాముగా వేరుగా ఉండకపోవడంతో ఇతరులకు సోకుతోంది.
- కొత్త కరోనా వైరస్ లక్షణాలకు ‘ఫ్లూ’ లక్షణాలతో దగ్గరి పోలికలుండటం వల్ల జనాలకు తికమక కలుగుతోంది. చాలామంది తమకు వచ్చింది ‘ఫ్లూ’యే అనుకుని ఇతరత్రా జాగ్రత్తలేవీ తీసుకోవడం లేదు.
- అన్నింటికంటే ముఖ్యమైనది.. ఈ వైరస్ చాలా సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే ప్రారంభంలో ఇది గొంతు దగ్గరే తిష్ట వేస్తుంది. గొంతు నిండా ఈ వైరస్ ఉండటంతో దగ్గినా, తుమ్మినా వందల కోట్ల సూక్ష్మక్రిములు బయటకొచ్చి ఇతరులకు వ్యాపిస్తాయి.
ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? దాని అవసరం ఏంటి?