భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, స్వాతంత్ర్య సమరయోధురాలు అమృత్ కౌర్‌లకు 'టైమ్ మ్యాగజైన్' తన వందమంది శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు కల్పించింది. 1947 ఏడాదికి గానూ కౌర్‌ను 'వుమెన్ ఆఫ్ ది ఇయర్'గా పేర్కొన్న టైమ్... 1976 ఏడాదికి ఇందిరా గాంధీని 'ఎంప్రెస్ ఆఫ్ ఇండియా'గా తన ప్రొఫైల్‌లో వివరించింది.
ఆర్థిక అస్థిరత నుంచి గట్టెక్కించిన గొప్ప నేత..
భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ. 1975న ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సరికి దేశం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఒకానొక పరిస్థితుల్లో ఆమె ఎన్నిక చెల్లదని భావించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో... ఆర్థిక అస్థిరత కారణంగా దేశంలో 'అత్యవసర పరిస్థితి'ని ప్రకటించిన గొప్ప నాయకురాలని టైమ్ తన ప్రొఫైల్‌లో తెలిపింది.
మలేరియా నివారణలో కౌర్ కృషి..
కపుర్తలా రాజ కుటుంబంలో జన్మించిన అమృత్ కౌర్ గురించి ప్రస్తావిస్తూ... 1918 లో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుంచి వచ్చాకా మహాత్మాగాంధీ బోధన పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారని తెలిపింది. ఆ తరవాత దేశంలో వలసలు, అణచివేతలు నుంచి విముక్తి కల్పించడమే తన జీవిత లక్ష్యంగా పనిచేసారని కొనియాడింది. స్వాతంత్ర్యం అనంతరం మొదటి ఆరోగ్య మంత్రిగా పనిచేసిన కౌర్... మలేరియా నివారణ ప్రచార కార్యక్రమాలు చేపట్టి వేల మందిని రక్షించారని పేర్కొంది.
అంతేకాకుండా.. ఈ శతాబ్దపు అనేక ప్రముఖ మహిళా నాయకుల వివరాలను ఈ ప్రాజెక్ట్ సేకరించింది. ఇందులో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరిపై విచారిస్తాం: సుప్రీం