ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పునరుద్ఘాటించారు. వ్యాక్సిన్‌ను రూపొందించి.. దానిని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలన్న భారత్ సంకల్పం ఇందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కరోనా వైరస్ అని అభిప్రాయపడ్డారు గేట్స్. ఒకసారి వ్యాక్సిన్ బయటకువచ్చాక.. దానిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి సరఫరా చేసేందుకు ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.
"వచ్చే ఏడాదిలో వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నాం. అది సమర్థంగా పనిచేస్తుంది, భద్రంగా ఉందని తెలిసిన వెంటనే.. ప్రపంచ దేశాల చూపు భారత్‌వైపు మళ్లుతుంది. వీలనైంత తక్కువ సమయంలో భారత్.. టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు అందిస్తుందని ఆశిస్తున్నాం. ఇలా.. భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి.. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలన్న భారత్ సంకల్పమే.. కరోనా వైరస్ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తుంది."
--- బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు.
ఇదీ చూడండి:- 'వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్'
'భారత్‌కు ఆ శక్తి ఉంది..'
సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్, బయో-ఈ వంటి భారత సంస్థలను ప్రస్తావించారు బిల్ గేట్స్. వీటి సామర్థ్యంతో వ్యాక్సిన్ తయారీ సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.
"వ్యాక్సిన్‌ను తీసుకుని భారత్‌లో ఉత్పత్తి చేయాలన్న ఆలోచన మాకు ఉంది. అస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్, జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి వచ్చిన టీకాను భారత్‌కు అప్పగిచాలని అలోచిస్తున్నాం. వీటికి సంబంధించి భారీ డోసులను సీరం ఉత్పత్తి చేసే విషయంపై మాట్లాడుకున్నాం. బయో-ఈతోనూ చర్చలు జరుగుతున్నాయి."
--- బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు.
కరోనాపై పోరాటానికి బిల్‌గేట్స్ కూడా తనవంతు సహకారం అందిస్తున్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌తో కరోనా వ్యాక్సిన్‌పై జరుగుతున్న చర్చలు.. ఆశించిన దాని కన్నా గొప్పగా సాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు చెందిన ఐసీఎమ్ఆర్.. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన విధివిధానాలను రూపొందించడానికి సమాలోచనలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- 'ప్రపంచం మొత్తానికీ భారతీయ వ్యాక్సిన్లు'