పరోటా అంటే మీకు చాలా ఇష్టమా.. రెండు మూడు ప్లేట్లయిన సులభంగా లాగించేస్తారా.. అయితే మీరు కచ్చితంగా హరియాణాలోని రోహ్తక్కు వెళ్లాల్సిందే. రుచికరమైన పరోటాలే కాదు.. ఓ హోటల్లో పెట్టిన పందెంలో పాల్గొని గెలిస్తే లక్ష రూపాయలు మీ సొంతం. ఆ విశేషాలు మీ కోసం.
రోహ్తక్లోని తపస్య హోటల్.. దేశంలోనే అతిపెద్ద పరోటాలకు పెట్టింది పేరు. జంబో పరోటాలు ఇక్కడే లభిస్తాయి. భోజన ప్రియులకు ఓ సవాల్ విసిరారు.. ఆ హోటల్ యజమాని. తమ హోటల్లో 50 నిమిషాల్లో 3 జంబో పరోటాలు తింటే లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. అంతే కాదండోయ్.. జీవితాంతం భోజనం ఉచితం కూడా. హోటల్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం ఇద్దరే ఈ పందెం నెగ్గినట్లు యజమాని చెబుతున్నారు.
ఈ హోటల్లో 50 రకాల పరోటాలు.. మూడు సైజుల్లో(సాధారణ, మధ్యస్థ, జంబో) తయారు చేస్తారు. అందులో బంగాళదుంప, కాలీఫ్లవర్, ఉల్లిపాయ, ఆల్ మిక్స్ పరోటాలు ఉన్నాయి.
జంబో సైజులోని పరోటాలు రెండున్నర అడుగుల మేర ఉంటాయి. ఇందులో 2 కిలోల కుర్మా వేస్తారు. స్వచ్ఛమైన దేశీయ నెయ్యితో తయారు చేస్తారు. ఇక్కడ మీడియం పరోటా ధర రూ. 90, జంబో సైజు పరోటాలు రూ. 300లు ఆపైన ఉంటాయి. ఈ జంబో పరోటాలను ఐదుగురు తినొచ్చు.
" మా వద్ద అతిపెద్ద పరోటాలు తయారు చేస్తున్నాం. తపస్య నా కుమార్తె పేరు. కూతురు పేరు మీదే రెస్టారెంట్ నడుపుతున్నా. పదేళ్ల క్రితం మన ఇళ్లలో చేసుకునే విధంగానే సాధారణ సైజ్‌లోనే పరోటాలు తయారు చేసే వాళ్లం. ఒక సారి నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. పరోటా తీసుకురమ్మని చెప్పింది. ఆ సమయంలో నా కుమార్తె వయసు ఒకటిన్నరేళ్లు. నేను పరోటాలు తీసి చూపించినప్పుడు నా కూతురు అవి చిన్నగా ఉన్నాయని.. పెద్దవి తయారు చేయమని చెప్పింది. అప్పటి నుంచి జంబో పరోటాలు చేస్తున్నాం."
- యజమాని, తపస్య హోటల్.
ఈ పరోటాలు తినేందుకు చుట్టుపక్కల వారు మాత్రమే కాదు.. చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తారు. నెయ్యి వేసి చేసిన రుచికరమైన పరోటాలు తిని అద్భుతంగా ఉన్నాయని చెబుతారు.
ఇదీ చూడండి: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రష్మీ!