దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజులోనే సుమారు ఏడువేల మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. మే 1న వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లు నడపడం, తర్వాత వారంలోనే విదేశాల్లోని భారతీయులను తీసుకురావడం కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు వల్ల.. వైరస్ బాధితుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
మూడు రెట్లు అధికంగా
ఇదే సమయంలో మృతుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 4వేల మార్కును దాటింది. కోలుకున్నవారి సంఖ్య 6 రెట్లు ఎగబాకింది. ప్రస్తుతం 60 వేలు మంది కోలుకున్నారు.
వారి రాకతో..
దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల్లో కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. బిహార్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వలస కార్మికులు.. స్వస్థలాలకు చేరుకోవడం వల్ల కేసుల సంఖ్య 10రెట్లు పెరిగిందని వైద్య నిపుణులు తెలిపారు.
మహారాష్ట్రలో కేసులు..
మహారాష్ట్రలో కొత్తగా నమోదైన వైరస్ కేసులు ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో కొత్తగా 2,436 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 52,667కు ఎగబాకిందని అధికారులు తెలిపారు. మరో 60 మంది మృతి చెందగా... మొత్తం మరణాల సంఖ్య 1,695కు చేరింది.
తమిళనాడులో..
తమిళనాడులో ఒక్కరోజు 805 కొత్త కేసులు నమోదు కావడం వల్ల.. రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 17,082కు చేరిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 549 కేసులు చెన్నైలోనే నమోదయ్యాయి. వైరస్ మృతుల సంఖ్య 118కి చేరింది.
ఇదీ చూడండి: మీ అసలు రూపాన్ని చెప్పేసే కొత్త మాస్క్!