మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హయాంలోనే బ్యాంకింగ్ రంగం దిగజారిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆరోపించారు. వాళ్లు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తూ, బ్యాంకింగ్ వ్యవస్థకు జీవం పోసే ప్రయత్నం చేస్తున్నామని ఆమె అన్నారు. అమెరికా న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చేసిన ఉపన్యాసంలో... ఎన్డీఏ ప్రభుత్వం తన తొలి ఐదేళ్ల పాలనలో దేశ ఆర్థికాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. దేశంలో కొంత మంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమై ఉందని ఆరోపించారు.
రాజన్ వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్ ఖండించారు. రాజన్ హయాంలోనే విపరీతంగా రుణాలు మంజూరు చేశారని విమర్శించారు. కొంత మంది వ్యక్తుల ప్రోద్బలంతో కేవలం ఫోన్ కాల్స్ ఆధారంగా అప్పులు ఇచ్చేశారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఫలితంగా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలో మునిగిపోయి.. నిధుల కోసం నేడు ప్రభుత్వం వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
ప్రధాని మోదీ వద్దే అధికారం కేంద్రీకృతమైందన్న విమర్శలను నిర్మలాసీతారామన్ తోసిపుచ్చారు. మోదీ ప్రభుత్వంలో అధికారం ఏ ఒక్కరి చేతిలో కేంద్రీకృతమై లేదని పేర్కొన్నారు. ప్రధాని సరిసమానుల్లో ప్రథముడు మాత్రమే అని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్లో శాంతి కోసమే ఆర్టికల్ 370 రద్దు'