కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని... లేదంటే ఆగస్టు 10 నాటికి దేశంలో 20 లక్షలకు పైగా కరోనా కేసులు పెరిగిపోతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
"దేశంలో కరోనా కేసులు 10 లక్షలు దాటిపోయాయి. మహమ్మారి విజృంభణ ఇలాగే కొనసాగితే ఆగస్టు కల్లా కొవిడ్ కేసులు 20 లక్షలు దాటడం ఖాయం."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ట్వీట్
కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమిటో తెలపాలని రాహుల్ డిమాండ్ చేశారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా... కేంద్ర ప్రభుత్వం దృఢమైన, ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నేను చెప్పానా?
రాహుల్ గాంధీ మంగళవారం 'ఈ వారంలోగా దేశంలో కరోనా కేసులు 10 లక్షలు దాటతాయి' అని ట్వీట్ చేశారు. ఇవాళ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 లక్షల దాటిన నేపథ్యంలో... దానిని రీట్వీట్ చేశారు.
కరోనాతో అతలాకుతలం
భారత్‌లో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. వైరస్ బారినపడి 25 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ధాటికి తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
ఇదీ చూడండి: లద్దాఖ్‌లో రక్షణ మంత్రి- క్షేత్రస్థాయి పరిశీలన