రష్యాలో జరిగే అంతర్జాతీయ యుద్ధ విన్యాసాలు 'కావ్‌కాజ్-2020'లో పాల్గొనకూడదని భారత్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటమే ఇందుకు కారణం అని వెల్లడించింది. ఈ విషయాన్ని రష్యాకు కూడా విన్నవించినట్టు పేర్కొంది.
అయితే చైనా, పాకిస్థాన్ బలగాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొనటమే భారత్ నిర్ణయానికి ముఖ్య కారణమని అధికార వర్గాల సమాచారం.
"సౌత్ బ్లాక్‌లో విదేశాంగ మంత్రి జైశంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సమక్షంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనా, పాక్ బలగాలు కూడా వస్తోన్న నేపథ్యంలో విన్యాసాల్లో పాల్గొనటం సరైనది కాదని చర్చించారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నా చైనాతో కలిసి విన్యాసాలు చేయటం అంత మంచిది కాదు."
- రక్షణ శాఖ వర్గాలు
తొలుత భారత్ ఈ కార్యక్రమానికి 150 ఆర్మీ , 45 మంది వాయుసేనతోపాటు కొంతమంది నేవీ అధికారులను పంపాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
దక్షిణ రష్యాలోని అస్త్రాఖాన్ ప్రాంతంలో సెప్టెంబర్ 15-26 మధ్య యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇందులో చైనా, పాక్‌తోపాటు షాంఘై సహకార సంఘం సభ్య దేశాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 'ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్య పోరు'