భారతదేశంలో ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగుచూడగా.. జులై 1 నాటికి అవి 6 లక్షలకు పైగా పెరగవచ్చని అంచనా వేశారు మిషిగన్ వర్సిటీ పరిశోధకురాలు భ్రమర్ ముఖర్జీ. ఈ మహమ్మారి నియంత్రణకు భారత దేశమంతా ఏకరీతి పద్ధతి అనుసరించలేదని... అందువల్ల వైరస్ క్రమంగా విస్తరిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
భారత సంతతికి చెందిన భ్రమర్ ముఖర్జీ... అమెరికాలోని మిషిగన్ వర్సిటికీ చెందిన స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రొఫెసర్. బయోస్టాటిస్టిక్స్ విభాగానికి ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత్‌లో వైరస్ ప్రభావాన్ని తగ్గించాలంటే.. మరింత వేగంగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే...
ప్రత్యామ్నాయం కావాలి..
భారత దేశ జనాభాలో 0.5 శాతం మందికి మాత్రమే ఇప్పటి వరకు కొవిడ్ నిర్ధరణ పరీక్షలు జరిగాయి. అదే సమయంలో మిగతా ప్రపంచదేశాలు తమ జనాభాలో 4 శాతం వరకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాయి. ఆ లెక్కన విశాల భారతదేశంలో కరోనా టెస్టులు నిర్వహించడం కష్టం. 6 మిలియన్ టెస్టుల స్థాయి నుంచి 54 మిలియన్ టెస్టుల స్థాయికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందువల్ల 'ఆర్టీ-పీసీఆర్' పరీక్షలకు ప్రత్యామ్నాయాలు చూడడం తప్పనిసరి.
కరోనా కేసులు గుర్తించేందుకు హైటెక్ లేదా ఖరీదైన వ్యూహాలు లేనప్పుడు.. రోగ లక్షణాల నిఘా, ఉష్ణోగ్రత తనిఖీ, ఆక్సిజన్ తనిఖీ, కాంటాక్ట్ డైరీలను నిర్వహించడం అవసరం. వాస్తవానికి కరోనా ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి పెద్ద సంఖ్యలో సెరో-సర్వే ( కొవిడ్ టెస్టులు) చేయాలి.
ఫలించని లాక్డౌన్
కరోనా నియంత్రణ కోసం భారత ప్రభుత్వం 9 వారాల పాటు లాక్డౌన్ విధించింది. ఆర్థిక వృద్ధిపై ఇది దుష్ప్రభావం చూపిన నేపథ్యంలో సడలింపులు ఇచ్చింది. ఫలితంగా ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా గల నాల్గవ దేశంగా భారత్ నిలిచింది.
ఇతర దేశాల్లో లాక్డౌన్ ముగిసిన 3-4 వారాల లోపు క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గడం ప్రారంభించాయి. కానీ దురదృష్టవశాత్తు, భారత్‌లో మాత్రం కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దేశం విశాలంగా ఉండడం. రెండోది లాక్డౌన్ వేళ మహమ్మారి వ్యాప్తి మందగించినా.. అది పూర్తిగా నాశనం కాలేదు.
భారత్‌లో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,10,461కి పెరిగింది. శనివారం రికార్డు స్థాయిలో 15,413 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆ సమయాన్ని వృథా చేశారా?
దీనిని చూస్తే ఓ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. లాక్డౌన్ సమయంలో... కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించేందుకు, రోగుల చికిత్స కోసం మౌలిక సదుపాయాల కల్పించడానికి ఏమైనా కృషి జరిగిందా?
వాస్తవానికి ఏమీ 'జరగలేదు' అని సమాధానం వస్తుంది. న్యూజిలాండ్‌లో పక్కా వ్యూహాలతో కరోనా వ్యాప్తిని నివారించగలిగారు. కానీ భారత్‌లో అది జరగలేదు. ఉదాహరణకు ముంబయిలోని ధారావి మురికివాడను తీసుకుంటే.. అక్కడ విపరీతంగా కరోనా అంటువ్యాధి ప్రబలింది. దీనికి ప్రధాన కారణం.. భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడమే. దేశంలో మిగతా ప్రాంతాల్లోనూ నిబంధనల అమలు సరిగ్గా జరగలేదని స్పష్టంగా చెప్పవచ్చు.
మరోవిధంగా చూడాలంటే కరోనా వైరస్ పశ్చిమ భారతం నుంచి తూర్పు భారతానికి వ్యాపించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికులు.. లాక్డౌన్ వల్ల తిరిగి స్వగ్రామాలకు వెళ్లారు. వారితో పాటు కరోనా వైరస్ కూడా వెళ్లింది.
జాగ్రత్తలు తప్పనిసరి
పరిస్థితుల తీవ్రత దృష్ట్యా కరోనా నివారణకు స్వీయ రక్షణ పద్ధతులు పాటించడమే శరణ్యం. ముఖ్యంగా మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు.
మానవాళి పాలిట మృత్యుదేవతగా పరిణమించిన ఈ మహమ్మారిని నియంత్రించాలంటే.. పటిష్ఠ వ్యూహం ఉండాలి. ముఖ్యంగా ఆసుపత్రులు, టెస్టింగ్ ల్యాబ్‌లు అభివృద్ధి చేయాలి. అప్పుడు మాత్రమే వైరస్ వ్యాప్తిని, మరణాలను నియంత్రించగలుగుతాం.
మళ్లీ లాక్డౌన్.. వద్దు!
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ.. మరోసారి లాక్డౌన్ విధించాలన్న ఆలోచన మంచిది కాదు. లాక్డౌన్ వల్ల వైరస్ నివారణ జరగదు. అదేమీ కషాయం కాదు.
దేశం మొత్తం లాక్డౌన్ విధించడం కన్నా.. వైరస్ హాట్స్పాట్లలో మాత్రమే లాక్డౌన్ విధించడం మంచిది. అలాగే ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లు, పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయాలి. అప్పుడు మాత్రమే కరోనాను కొంతవరకైనా నియంత్రించగలం.
ఇదీ చూడండి: బోర్డర్లో కొత్త రూల్స్- తుపాకులు వాడేందుకు సై!