పాకిస్థాన్ పార్లమెంట్ వేదికగా కశ్మీర్ అంశంపై టర్కీ అధ్యక్షుడు తైపీ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్. టర్కీ అధ్యక్షుడు చేసిన అన్ని వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. పాక్ పార్లమెంట్లో ఎర్డోగాన్ ఉటంకించిన ప్రాంతం భారత అంతర్గత భూభాగమని పునరుద్ఘాటించింది.
"భారత అంతర్గత భూభాగమైన కశ్మీర్‌పై టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నాం. భారత అంతర్గత వ్యవహారాల్లో టర్కీ నేతల జోక్యం ఎంతమాత్రం ఆహ్వానించదగినది కాదు. పాకిస్థాన్ నుంచి భారత్ లక్ష్యంగా పెచ్చరిల్లుతున్న సీమాంతర ఉగ్రవాదం సహా వాస్తవిక అంశాలపై టర్కీ నాయకత్వం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది."
-రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
పాక్ పార్లమెంట్ వేదికగా శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎర్డోగాన్. 'కశ్మీర్ ప్రజలు చేస్తున్న పోరాటం మొదటి ప్రపంచయుద్ధంలో విదేశీ శక్తుల ఆధిపత్యంపై టర్కీ ప్రజల ఉద్యమాన్ని గుర్తు చేస్తోంద'ని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్.
ఇదీ చూడండి: దిల్లీ: ప్రధాన ప్రతిపక్షనేత పదవికి భాజపాలో తీవ్ర పోటీ