కరోనా పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను మరింత పెంచే మరో సంచలన విషయం వెల్లడైంది. 2021 శీతాకాలానికి భారత్‌లో రోజుకు 2.87 లక్షల కేసులు నమోదవుతాయని ఎమ్ఐటీ(మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) పరిశోధకులు హెచ్చరించారు.
2021 శీతాకాలం నాటికి.. కరోనా వైరస్ వల్ల అత్యంత దారుణంగా ప్రభావితమయ్యే దేశంగా భారత్ నిలుస్తుందని పరిశోధకులు అంచనా వేశారు. దేశంలో రోజుకు 2.87లక్షల కేసులు వెలుగుచూస్తాయన్నారు. భారత్ తర్వాత అమెరికా(95,000కేసులు), దక్షిణాఫ్రికా(21,000కేసులు), ఇరాన్(17,000కేసులు), ఇండోనేషియా(13,000కేసులు) ఉంటాయని పేర్కొన్నారు.
ఈ పరిశోధన కోసం ఎస్ఈఐఆర్(ససెప్టబుల్, ఎక్స్పోజ్డ్, ఇన్ఫెక్షియస్ రికవర్డ్) మోడల్‌ను వినియోగించారు. అంటు వ్యాధులకు ప్రామాణికంగా ఎపిడమాలజిస్ట్‌లు ఈ మోడల్‌ను ఉపయోగిస్తారు.
2021 శీతాకాలం వరకు వ్యాక్సిన్ లేదా మెరుగైన చికిత్స అందుబాటులోకి రాకపోతే.. ప్రపంచవ్యాప్తంగా 24.9కోట్ల(249మిలియన్) కేసులు వెలుగుచూస్తాయన్నారు. 18లక్షలమంది మరణిస్తారని అంచనా వేశారు.