సరిహద్దు గ్రామాల్లోని ముగ్గురు పౌరుల్ని కాల్చి చంపిన పాక్ వైఖరిపై.. భారత్ మండిపడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడిస్తే ఊరుకునేది లేదని దాయాదిని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ హైకమిషన్‌లోని ఓ ఉన్నత దౌత్యవేత్తకు అధికారిక లేఖ పంపింది.
పదే పదే అదే బుద్ధి..
ఓ వైపు ప్రపంచమంతా కరోనాతో ఎడతెరిపి లేకుండా పోరాడుతున్న సమయంలో... పాకిస్థాన్ వక్రబుద్ధి ప్రదర్శిస్తోంది. ఇటీవలె జమ్ముకశ్మీర్ కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద.. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు గ్రామాల్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడింది. పొరుగు దేశం దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ మైనర్ కూడా ఉన్నాడు.
కేవలం 2019లో 3,200 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది దాయాది దేశం. ఇక భారత ప్రభుత్వం 370 అధికరణాన్ని రద్దు చేసి.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 1,565 సార్లు నియమాలను ఉల్లఘించింది. భారత సైన్యం ఎప్పటికప్పుడు ప్రత్యర్థికి దీటైన జవాబిస్తూ వస్తోంది.
అయితే, ఆదివారం దుడ్నియల్, రాఖ్‌క్రీ, చిరికోట్, బరోహ్ సెక్టార్లలో మొదట భారత సైన్యమే కాల్పుల విరమణ ఉల్లంఘంచిందని ఆరోపించింది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఆ దాడిలో దుడ్నియల్కు చెందిన రెండేళ్ల బాలుడు మృతి చెందాడని వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి:కరోనాను మట్టుబెట్టే ఆయుధాలకు సృష్టికర్తలు వీరే..