శ్రామిక్ రైళ్ల టికెట్ రుసుములో రైల్వే 85% రాయితీ ప్రకటించిందని మిగతా 15శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని భారతీయ జనతా పార్టీ తెలిపింది. వలస కూలీలు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని స్పష్టం చేసింది. అసలు రైల్వే కౌంటర్లలో టికెట్లే ఇవ్వడం లేదని పేర్కొంది. ప్రజలు కౌంటర్ల వద్ద గుమిగూడేలా కాంగ్రెస్ రెచ్చగొడుతోందని ఇది కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని తెలిపింది. ఇటలీలో జరిగినట్టే భారత్‌లోనూ జరగాలని కోరుకుంటున్నారా అని సోనియాగాంధీని ప్రశ్నించింది.
సోనియా విమర్శలు
వలస కూలీల వద్ద కేంద్ర ప్రభుత్వం టికెట్ డబ్బులు వసూలు చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. అందుకయ్యే ఖర్చును ఆ పార్టీ రాష్ట్ర కమిటీలు భరించాలని పిలుపునిచ్చారు. ఒకవైపు పీఎం కేర్స్‌కు రైల్వే రూ.151 కోట్లు విరాళంగా ప్రకటించి మరోవైపు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల వద్ద టికెట్ డబ్బులు వసూలు చేస్తోందని రాహుల్ గాంధీ సైతం అన్నారు. వీరి విమర్శలకు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, ఐటీ సెల్ బాధ్యుడు అమిత్ మాలవీయ ఘాటుగా బదులిచ్చారు.
రాహుల్జీ ఓ సారి ఇది చూడండి
'రాహుల్ గాంధీజీ, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను నేను అటాచ్ చేశాను. ఏ స్టేషన్‌లోనూ టికెట్లు అమ్మరాదని అందులో స్పష్టంగా ఉంది. రైల్వే 85శాతం రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం 15% చెల్లించాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను చెల్లించమని చెప్పండి (మధ్యప్రదేశ్ భాజపా ప్రభుత్వం చెల్లిస్తోంది)' అని పాత్ర ట్వీట్ చేశారు. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం 'శ్రామిక్ ఎక్స్‌ప్రెస్'లను నడిపిస్తోందని, ప్రతి రైలుకు సంబంధించి 1200 టికెట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తోందని వెల్లడించారు.
'భారత్ కొవిడ్-19ను సమర్థంగా నియంత్రిస్తున్నందుకు కాంగ్రెస్ నీరసపడింది. ఇంకా ఎక్కువ మంది బాధపడాలని, చనిపోవాలని వారు కోరుకున్నారు. నియంత్రణ లేని జన సంచారంతో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఇటలీని మనం చూశాంగా. సోనియాగాంధీ ఇదే కోరుకుంటున్నారా?' అని మాలవీయ ట్వీట్ చేశారు. 'ఇప్పుడే పియూష్ గోయల్ కార్యాలయంతో మాట్లాడాను. కేంద్రం 85%, రాష్ట్రం 15% భరిస్తాయి. వలస కూలీలు ఉచితంగా వెళ్తారు. మంత్రిత్వశాఖ అధికార ప్రకటన చేస్తుంది' అని అంతకుముందు భాజపా ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీటారు.