చైనా సరిహద్దు వెంబడి రహదారుల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కీలకమైన చాలా రహదారులు పూర్తి అయ్యాయి. తాజాగా దార్మా లోయను అనుసంధానించే మరో రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది.
కేంద్ర ప్రజాపనుల శాఖ (సీపీడబ్ల్యూడీ) నిర్మిస్తోన్న ఈ మార్గంలో ఏడు వంతెనల్లో ఆరు ఇప్పటికే పూర్తయ్యాయి. రోడ్డు కట్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. వర్షాకాలం తర్వాత హాట్మిక్స్ పనులను ప్రారంభిస్తారని తెలుస్తోంది.
తొందరగా చేరుకోవచ్చు..
చైనా దురాక్రమణ వైఖరిని దృష్టిలో పెట్టుకుని సరిహద్దు వెంబడి రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది భారత్. ఇప్పటికే లిపులేఖ్ రహదారి ప్రారంభం కాగా... దార్మా లోయలోని దుగ్తుపై దృష్టి సారించింది. ఈ రోడ్డు పూర్తయితే దార్మా లోయలోని 14 గ్రామాలకు రవాణా సులభతరం కానుంది. భద్రతా దళాలు సరిహద్దు చేరుకునే సమయం కూడా తగ్గుతుంది.
వ్యూహాత్మకంగా కీలకం..
దుగ్తు గ్రామం చైనాలోని జ్ఞానిమా మండీకి అత్యంత సమీపంలో ఉంటుంది. టిబెటన్ మార్కెట్ తక్లాకోట్ తరువాత చైనా జ్ఞానిమా మండీ వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉంది. ఈ కోణంలో సోబ్లా- దార్మా రహదారి కూడా చాలా కీలకమైనది. అయితే సోబ్లా- దార్మా రహదారిని దుగ్తు వరకు పొడిగించే క్రమంలో భారత ఇంజినీర్లు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి: సరిహద్దుల్లో గస్తీ ముమ్మరం- రాజ్నాథ్ సమీక్ష