గగన్‌యాన్ ప్రయోగంలో పాల్గొనే వ్యోమగాములకు కావాల్సిన అత్యవసర పరికరాలు సమకూర్చే విషయంపై భారత్-ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థల మధ్య అత్యున్నత చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫ్రాన్స్ జాతీయ అంతరిక్ష అధ్యయన కేంద్ర(ఎన్సీఎస్ఎస్) అధికారులు తెలిపారు. మిషన్ ఆల్ఫాలో వ్యోమగామి థామస్ పెస్క్వెట్ ఉపయోగించే తరహా పరికరాలనే భారత్‌కు అందించనున్నట్లు తెలుస్తోంది.
మిషన్ ఆల్ఫా కోసం పరికరాల తయారీ ప్రారంభమైందని.. ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సీనియర్ అధికారులు వెల్లడించారు. ఐరోపా అంతరిక్ష సంస్థ తరపున ఫ్రాన్స్‌కు చెందిన పెస్క్వెట్ ఈ యాత్రలో భాగం కానున్నారు.
మరోవైపు కరోనా తగ్గుముఖం పట్టి.. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత భారత స్పేస్ సర్జన్లు శిక్షణ కోసం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు.
బలమైన బంధం
భారత్, ఫ్రాన్స్ మధ్య అంతరిక్ష రంగంలో లోతైన సంబంధాలు ఉన్నాయి. గగన్‌యాన్ కోసం ఇరుదేశాలు సహకరించుకుంటున్నాయి. ఇందుకోసం భారత్‌లోని వైద్యులు, ఇంజినీర్లకు సీఎన్ఈఎస్ అధికారులు గతేడాది శిక్షణ ఇచ్చారు. అంతరిక్ష వైద్యానికి సంబంధించి ఫ్రాన్స్‌లో ప్రత్యేక సంస్థ కూడా ఉంది.
ప్రస్తుతం గగన్‌యాన్ ప్రయోగం కోసం ఎంపిక చేసిన నలుగురు భారత వాయుసేన పైలట్లు రష్యాలో శిక్షణ పొందుతున్నారు. 2022 నాటికి అంతరిక్షంలోకి మానవులను పంపేందుకు ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.